పడినా లేచాడు… పదేళ్లలో పేరు నిలబెట్టాడు

సరిగ్గా దశాబ్దం క్రితం ఇదే రోజున మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరోల బ్లేసింగ్స్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని కుర్రాడు, కింగ్ నాగ్ వారసుడు నాగ చైతన్య. అక్కినేని లెగసీని మోస్తూ జోష్ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన నాగ చైతన్య, మొదటి సినిమాకే ఊహించని ఫ్లాప్ ఫేస్ చేశాడు. అక్కినేని వారసుడు మొదటి సినిమాకే నిరాశ పరచడం అంటే మాములు విషయం కాదు, వేలెత్తి చూపించడానికి చాలా మంది రెడీగా ఉంటారు. ఆరు నెలలు తిరిగే లోపు విమర్శించిన వాళ్లందరినీ సైలెంట్ చేస్తూ నాగ చైతన్య ఈసారి ఏం మాయ చేసావే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. మళ్లీ పాత వరసే, ఏం మాయ చేసావే సినిమాపై మొదటి రోజే విమర్శలు వినిపించాయి. స్లోగా ఉందని ఒకరు, బాగోలేదని ఒకరు… ఇలా ఎవరికి తోచిన మాట వాళ్లు మాట్లాడడం మొదలు పెట్టారు. నెమ్మదిగా రోజులు గడిచాయి సినిమా బాగోలేదు అన్న వాళ్లే, ఇది కదా అక్కినేని హీరో నుంచి మేము కోరుకునేది అని మాట్లాడడం మొదలుపెట్టారు. వారం తిరిగే సరికి నాగ చైతన్య ఖాతాలో మొదటి హిట్ పడింది.

10 years for chay in tfi

మూడో తరం అక్కినేని అభిమానులందరినీ తలెత్తుకోని తిరిగేలా చేసిన నాగ చైతన్య, నేటితో ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అయ్యింది. ఈ దశాబ్ద కాలంలో క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేసిన చైతన్య, హిట్ ఫ్లాప్ కి సంబంధం లేకుండా నచ్చింది చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ప్రాసెస్ లో అపజయాలు ఎదురైనా చై భయపడలేదు, వెనుదిరిగి చూడలేదు. ఎన్ని సార్లు పడినా పైకి లేచాడు, పడిపోతానేమో అని తెలిసినా ప్రయోగాలు చేశాడు. తాత, తండ్రీ బాటలోనే నడుసస్తూ సినీ అభిమానులని అలరిస్తున్న నాగ చైతన్య రీసెంట్ గా మజిలీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇదే జోష్ కంటిన్యూ చేస్తూ మామ వెంకటేష్ తో కలిసి వెంకీ మామ సినిమా చేస్తున్నాడు, ఇది అయిపోగానే శేఖర్ కమ్ముల సినిమా సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాలు కూడా హిట్ అయ్యి చైతన్య మరింత ఎత్తుకి ఎదగాలని ప్రతి అక్కినేని అభిమాని కోరుకుంటున్నాడు.