రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో

త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్న క్రమంలో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దీనిని అదునుగా చేసి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడు ఎన్నికలంటేనే.. సినీ సెలబ్రెటీల హవా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కమల్‌హాసన్ కొత్త పార్టీ పెట్టి గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయగా.. ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇప్పటికే ప్రకటించాడు.

VIJAY

డిసెంబర్ 31న కొత్త పార్టీ గురించి ప్రకటన చేస్తానని, జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని చెప్పాడు. ఇక మరో కోలీవుడ్ హీరో విశాల్ కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. జయలలిత చనిపోయిన తర్వాత జరిగిన ఆర్కే ఉపఎన్నికలో పోటీ చేసేందుకు విశాల్ నామినేషన్ వేశాడు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నామినేషన్‌ను చివరి నిమిషంలో ఉపసంహరించుకున్నాడు.

త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా విశాల్ పోటీ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇంతలోపే తమిళ పాలిటిక్స్‌లో మరో హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్త హాల్ చల్ చేస్తోంది. అతడు ఎవరో కాదు… కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి. తాజాగా చెన్నైలో ఉన్న తన ఫాంహౌస్‌లో తన అభిమాన సంఘంలోని కీలక వ్యక్తులతో విజయ్ సమావేశమయ్యాడు.

‘మక్కల్ ఇయక్కం’ అనే పేరుతో విజయ్ ఒక స్వచ్చంధ సంస్థను నడుపుతున్నాడు. ఈ పేరుతోనే విజయ్ పొలిటికల్ పార్టీ ప్రారంభించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. విజయ్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు ఎప్పటినుంచో ఒత్తిడి చేస్తున్నారు. దీంతో తన అభిమానులు ఎవ్వరూ ఇతర పార్టీలలో చేరవద్దని, తన అభిమానుల కోరిక త్వరలోనే నెరవేరబోతున్నట్లు విజయ్ తాజా మీటింగ్‌లో చెప్పినట్లు తెలుస్తోంది.