కేఫ్‌కు వస్తే సగం బిల్లు చెల్లిస్తా

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగానే కాకుండా వ్యాపారాల్లో కూడా రాణిస్తున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే టాప్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. తన సినిమాలతో యూత్‌లో బాగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హీరోగా వరుస సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ.. వ్యాపారవేత్తగా కూడా మారుతున్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండ పలు వ్యాపారాలు ప్రారంభించిన విషయం తెలిసిందే.

VIJAYDEVARAKONDA

రౌడీ వేర్ ఫ్యాషన్ బ్రాండ్లతో పాటు ఇటీవల ఎలక్ట్రిక్ వెహికిల్ కంపెనీలో విజయ్ దేవరకొండ భాగస్వామి అయ్యాడు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా బిజినెస్‌లోకి దిగాడు. ఇటీవల ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమాతో ఆనంద్ దేవరకొండ సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ సినిమాతో మంచి సక్సెన్‌ను అందుకుని హీరోగా తొలి సినిమాతోనే సక్సెస్ అయ్యాడు. అయితే హైదరాబాద్‌లో తన స్నేహితులు నిర్వహిస్తున్న “గుడ్ వైబ్స్ ఓన్లీ” కేఫ్‌లో ఆనంద్ దేవరకొండ పార్టనర్ అయ్యాడు. ఈ విషయాన్ని ఆనంద్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా తమ్ముడిగా అండగా ఉంటూ వీకెండ్ గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్‌కు శని, ఆదివారాల్లో వచ్చిన కస్టమర్ల సగం బిల్ తాను పే చేస్తానని విజయ్ దేవరకొండ అనౌన్స్ చేశాడు.

ఆనంద్ దేవరకొండ ట్వీట్ చేస్తూ….”నేను, మా అన్నయ్య విజయ్ ఇద్దరం ఫుడ్ బేస్డ్ మూవీస్ తోనే మంచి సక్సెస్ అందుకున్నాం. “మిడిల్ క్లాస్ మెలొడీస్” ద్వారా వచ్చిన నా రెమ్యునరేషన్‌ను ఈ ఫుడ్ బిజినెస్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను. మా స్నేహితులు కలిసి నిర్వహిస్తున్న “గుడ్ వైబ్స్ ఓన్లీ” కేఫ్‌లో భాగస్వామి అవడం సంతోషంగా ఉంది. మీ ప్రేమ వల్లే మా కలలను నెరవేర్చుకోగలుగుతున్నాం.” అని పేర్కొన్నాడు.

దీనికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ… “మిడిల్ క్లాస్ మెలొడీస్” సినిమా హిట్ అయిన సంతోషంలో ఉన్నాను. నేను నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. అందుకే ఈ వీకెండ్ “గుడ్ వైబ్స్ ఓన్లీ” కేఫ్‌కు వచ్చే మీ కోసం సగం బిల్ నేను చెల్లిస్తాను. సో మీ అందరికీ వెల్ కమ్. బిల్ నాది” అని ట్వీట్ చేశాడు.