మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గోస్ టు ఎంపైర్

అదృష్టాన్ని హగ్ చేసుకునే లోపు, దురదృష్టం వచ్చి లిప్ లాక్ పెట్టి వెళ్లిందంట. ఈ సామెత కింగ్స్ ఎలెవన్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే గెలవాల్సిన మ్యాచ్, గెలుపు చేతికి అందిన మ్యాచ్… ఎవరి తప్పిదం కారణంగానో ఓడిపోవాల్సి వచ్చింది. గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఐపీఎల్ 2020లో సెకండ్ మ్యాచ్, ఢిల్లీ క్యాపిటల్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. ఆరంభంలో వికెట్స్ కోల్పోవడం, ఆ తర్వాత కుదురుకోని మంచి రన్స్ చేయడం, ఆ తర్వాత డెత్ బౌలింగ్ లో తడబడి నిలబడడం… నిన్నటి మ్యాచులో జరిగిన రెండు ఇన్నింగ్స్ లో ఉన్న కామన్ పాయింట్స్ ఇవే. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 8 వికెట్స్ కోల్పోయి 157 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ స్టార్టింగ్ లోనే వికెట్స్ కోల్పోయిన ఢిల్లీకి స్టోనిస్ లాస్ట్ ఓవర్ లోనే 30 రన్స్ తెచ్చి పంజాబ్ బౌలింగ్ ని తుత్తునియలు చేశాడు. 158 రన్స్ తో టార్గెట్ ఛేజింగ్ స్టార్ట్ చేసిన పంజాబ్ టీం కూడా ఆరంభంలో తడబడింది, రాన్ రేట్ మైంటైన్ చేస్తూనే ఉన్నా ప్రతి ఇంటర్వెల్ కి వికెట్స్ పడడంతో రిజల్ట్ రెండు జట్ల మధ్య దోబూచులాడింది. ఇక ఢిల్లీ గెలవడమే తరువాయి అనుకుంటున్న టైములో యంగ్ ఇండియన్ ప్లేయర్ మయాంక్ 60 బంతుల్లో 89 రన్స్ కొట్టి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇక లాస్ట్ ఓవర్ లో 6 బాల్స్ కి 13 రన్స్ కొట్టాల్సి ఉండగా, స్టోనిస్ వేసిన మొదటి బంతికి సిక్స్ కొట్టి మయాంక్ ఢిల్లీపై ప్రెజర్ పెంచాడు. తర్వాత బంతి డాట్ అయినా నెక్స్ట్ బాల్ ని మయాంక్ మళ్లీ బౌండరీ తరలించాడు. ఇక 5 బాల్స్ కి 3 రన్స్ చేయాల్సిన టైములో ఒక అనవసర షాట్ కి వెళ్లి మయాంక్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన జోర్డాన్ కూడా అవుట్ అవ్వడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కి వెళ్ళింది. ఈ సూపర్ ఓవర్ లో ఢిల్లీ గెలిచి మ్యాచ్ ని తమ వైపు తిప్పుకుంది.

అసలు ఎప్పుడో పంజాబ్ వైపు తిరిగిన మ్యాచ్ ని, తప్పుడు నిర్ణయంతో ఢిల్లీవైపు తిప్పిన ఘనత ఎంపైర్ కే దక్కింది. పంజాబ్ విజయానికి 10 బంతుల్లో 21 రన్స్ అవసరమైన దశలో.. రబాడ వేసిన ఔట్ సైడ్ ఫుల్ టాస్‌ను మయాంక్ ఎక్స్ ట్రా కవర్ దిశగా బాదాడు. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న జోర్డాన్, మయాంక్ రెండు పరుగులు తీశారు. కానీ జోర్డాన్ బ్యాట్‌ను క్రీజులో ఉంచలేదనే కారణంతో స్క్వేర్ లెగ్ అంపైర్ ఒక పరుగులో కోత విధించాడు. కానీ రిప్లేలో జోర్డాన్ బ్యాట్ అంచు క్రీజును దాటి లోపలికి వచ్చిందని తేలింది. కానీ షార్ట్ రన్ కోత మాత్రం తప్పలేదు. ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. అంపైర్ ‘షార్ట్ రన్’ తప్పిదమే లేకపోతే 20.3 ఓవర్లలోనే పంజాబ్ మ్యాచ్‌ను గెలిచేది. ఈ ఒక్క పరుగు మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. అంపైరింగ్ తప్పిదం పట్ల మండిపడుతూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

ఈ విషయమై మాజీ క్రికెటర్.. గతంలో పంజాబ్ మెంటార్‌గా వ్యవహరించిన వీరేందర్ సెహ్వాగ్ ఘాటుగా స్పందించారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఛాయిస్‌తో నేను ఏకీభవించను. షార్ట్ రన్ కోత విధించిన అంపైర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలి. అది షార్ట్ రన్ కాదు. అదే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది’ అని వీరూ ట్వీట్ చేశాడు. ఎంపైర్ తప్పిందం గురించి ప్రీతి జింటా స్పందిస్తూ… ‘కోవిడ్ సమయంలోనూ నేను ఉత్సాహంగా యూఏఈకి వచ్చాను. ఆరు రోజులు క్వారంటైన్లో గడిపాను, ఐదుసార్లు కోవిడ్ టెస్టులు చేయించుకున్నాను. ఇవన్నీ చిరునవ్వుతోనే చేశాను. కానీ ఒక్క షార్ట్ రన్ నాపై బలంగా ప్రభావం చూపింది. వాడుకోలేనప్పుడు టెక్నాలజీ ఎందుకు? కొత్త రూల్స్ ప్రవేశపెట్టడానికి ఇదే సమయం అంటూ బీసీసీఐ”ని ఆమె ట్యాగ్ చేశారు. ఏది ఏమైనా ఢిల్లీ గెలవడంలో స్టోనిస్ కష్టం ఎంత ఉందో, ఎంపైర్ రాంగ్ డెసిషన్ గొప్పదనం కూడా అంతే ఉంది.