స‌త్యారెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో‌ “ఉక్కు సత్యాగ్రహం” ఈ నెల 20న షూటింగ్ ప్రారంభం..

తాను ఏ తరహా సినిమా తీసినా అందులో సామాజిక అంశాలను మిళితం చేసే సత్యారెడ్డి ఇప్పటివరకు ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి ,రంగుల కళ, కుర్రకారు, అయ్యప్ప దీక్ష , గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా వంటి 42 చిత్రాలు నిర్మించారు. దర్శక, నిర్మాతగానే కాకుండా నటుడిగా కూడా తన అభిరుచిని చాటుకుంటున్న విషయం తెలిసిందే. జనం సమస్యల పరిష్కారం కోసం రగులుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాన అంశంగా చేసుకుని తాజాగా “ఉక్కు సత్యాగ్రహం” పేరుతో సత్యారెడ్డి ఓ సినిమా తీస్తున్నారు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సత్యారెడ్డి రూపొందించే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది.

ukku sathyagraham


ఈ విషయాన్ని సత్యారెడ్డి తెలియజేస్తూ, ఈ చిత్రం షూటింగ్ విశాఖపట్టణం ఢిల్లీ ప్రాంతాల్లో జరుపుతున్నట్లు తెలిపారు. ఇందులో ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఒక పాట రాసి తానే పాడారని, ఆ పాటలో ఆయనే నటిస్తారని సత్యారెడ్డి చెప్పారు. అలాగే వందేమాతరం శ్రీనివాస్, గోరేటి వెంకన్న కూడా పాటలు పాడానున్నారని ఆయన తెలిపారు. ఇంకా సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న పాటలు రాస్తున్నారని ఆయన వివరించారు. ప్రముఖ నటీనటులతో పాటు ఇంకా ఈ చిత్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు, రాజకీయ ప్రముఖులు, ప్రజాసంఘాల నాయకులు నటిస్తారని ఆయన తెలిపారు. సంగీతం- శ్రీకోటి, కెమెరా- వెంకట్, నిర్మాణ సారధ్యం- పి సతీష్ రెడ్డి, సహ నిర్మాతలు- సంఘం శంకర్ రెడ్డి, కుర్రి నారాయణరెడ్డి, గద్దాడ చంద్రశేఖర్, రచనా సహకారం -శ్రీ వేముల, నిర్వహణ: పోలిశెట్టి వెంకట నాగు.