తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి (Telangana cinematography minister) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని (Komatireddy Venkat Reddy) తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) అధ్యక్షుడు, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో.. లోటస్్పండ్లోని నివాసంలో కోమటిరెడ్డిని కలిసి అభినందనలు అందజేసి సత్కరించారు. నిర్మాతలు సురేశ్ బాబు, సుధాకర్ రెడ్డి, సి. కల్యాణ్, తుమ్మల ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకులు రాఘవేంద్రరావుతోపాటు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మంత్రిని కలిసి అభినందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రితో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ పరిశ్రమ తరఫున సన్మానం చేయాలని తాము నిర్ణయం తీసుకున్నట్టు మంత్రికి తెలిపారు. సినీ పరిశ్రమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన కోమటిరెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిశ్రమ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తా అని హామీ ఇచ్చారు.