ఈసారి తమిళ కథపై పడ్డారు

టైగర్ ష్రాఫ్ బాఘీ ఫ్రాంచైజ్‌లో ప్రస్తుతం నటిస్తున్న సినిమా బాఘీ 3. ఈ సిరీస్ లో గతంలో వచ్చిన రెండు సినిమాలు హిట్ అవ్వడంతో, చిత్ర యూనిట్ మూడో సినిమా చేయడానికి రెడీ అయ్యింది. బాఘీ మొదటి సినిమా ప్రభాస్ వర్షం సినిమాకి రీమేక్ కాగా, రెండో బాఘీ అడివి శేష్ నటించిన క్షణంకి రీమేక్‌గా రూపొందింది. ఇక ఇప్పుడు బాఘీ 3 విషయానికి వస్తే, ఈ మూవీని కూడా రీమేక్ కథతోనే తెరకెక్కిస్తున్నారు. అయితే తెలుగు సినిమాని కాకుండా తమిళ సినిమాని రీమేక్ చేస్తుండడం విశేషం. బాఘీ 3 మూవీ 2012లో రిలీజ్ అయిన వెట్టైకి రీమేక్‌గా రూపొందనుంది. తమిళంలో ఆర్ మాధవన్, ఆర్య ప్రధాన పాత్రాలు పోషించిన ఈ మూవీ కోలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది.

వెట్టై సినిమాని తెలుగులో తడాఖా పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో నాగ చైతన్య, సునీల్ అన్న దమ్ములుగా నటించారు. కమర్షియల్ గా సక్సస్ అయిన ఈ సినిమా చైతన్యకి మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు బాఘీ 3లో మాధవన్ పాత్రని రితేష్ దేశముఖ్ ప్లే చేస్తున్నాడు. సాజిద్ నిర్మాణంలో అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడో పార్ట్ ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. వారం రోజుల పాటు జరగనున్న మొదటి షెడ్యూల్ పూర్తి కాగానే సెర్బియా, జార్జియాలో తర్వాతి షెడ్యూల్ మొదలు పెట్టనున్నారట. అక్టోబర్‌లో క్లైమాక్స్ కి సంబంధించిన షూటింగ్‌ని ఆ ప్రాంతాలలో జరపనున్నారు.