దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మొదటిసారి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ పై రోజురోజుకు వివాదాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఎన్టీఆర్ కి సంబంధించిన కొమురం భీమ్ అంతా బాగానే ఉన్నప్పటికీ చివరలో వచ్చిన ముస్లిం లుక్ పై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.
అల్లూరు సీతారామరాజు పాత్రను చెర్రీ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆ లుక్ యొక్క టీజర్ వచ్చినప్పుడు పెద్దగా అభ్యంతరాలు రాలేదు. అయితే తారక్ భీమ్ పాత్ర యొక్క టీజర్ వచ్చినప్పుటి నుంచి ఎవరో ఒకరు ఎన్టీఆర్ ధరించిన టకియాను తొలగించాలని హెచ్చరిస్తున్నారు. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు కూడా ముస్లిం వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ లుక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా గనక థియేటర్స్ లోకి వస్తే భీమ్ మద్దతుదారులు థియేటర్స్ ని తగలబెట్టే అవకాశం ఉందని కూడా అన్నారు. వీలైనంత త్వరగా రాజమౌళి తన పొరపాటును సరిదిద్దుకోవాలని కూడా హెచ్చరించారు.