అలనాటి బాలీవుడ్ అందాల రాకుమారుడు, ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ (98) ఇకలేరు. ముంబయిలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత బుధవారం ఆసుపత్రిలో చేరిన ఆయన ఈరోజు మృత్యు ఒడికి చేరుకున్నారు. జూన్ 6న అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులు చేర్చగా.. ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స అందించడంతో కోలుకున్నారు. ఆయన మరణంతో బాలీవుడ్ ఇండ్రస్టీ దిగ్భ్రాంతికి గురైంది.
పాకిస్థాన్ లో పుట్టిన వాడు, సినిమాల్లోకి రాక ముందు తండ్రితో కలిసి పండ్లు అమ్ముకున్న వాడు… బాలీవుడ్ ని నాలుగు దశాబ్దాల పాటు ఏక ఛత్రాదిపత్యంగా ఏలాడు. దిలీప్ కుమార్ అసలు పేరు యూసఫ్ ఖాన్, సినిమాల్లోకి వచ్చాక అతనితో హిట్ పైర్ గా పిలవబడిన దేవికారాణి, లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోకి యూసఫ్ ఖాన్ అనే పేరు బాగోలేదని దాన్ని దిలీప్ కుమార్ గా పట్టుబట్టి మరీ మార్పించింది. 1944లో వచ్చిన జ్వార్ బట్ట సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దిలీప్ కుమార్, 1947లో విడుదలైన జుంగు ఆయనకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. అలాగే 1948లో విడుదలైన షహీద్, మేళ అనే చిత్రాలు హిట్ సినిమాలు హిట్ ఇచ్చాయి. 1949లో విడుదలైన అందాజ్ నటుడిగా దిలీప్ కుమార్ కి పెద్ద బ్రేక్. 1950 నుండి స్టార్ డమ్ అందుకోని బాలీవుడ్ ఇండ్రస్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు.
మొఘల్ ఎ అజమ్, దేవదాస్, నయా దర్, గంగా జమున, రామ్ ఔర్ శ్యామ్ వంటి చిత్రాల్లో నటించారు. ఖాన్ త్రయం అనగానే షారుక్, ఆమిర్, సల్మాన్ గుర్తొస్తారు కానీ బాలీవుడ్ కి మొదటిఖాన్ ఇతనే. ది ఫస్ట్ ఖాన్, ది ట్రాజెడి కింగ్ అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే వారు. ఇండియా చూసిన ఫస్ట్ జనరేషన్ సూపర్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడు దిలీప్ కుమార్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే.. దిలీప్ కుమార్ ముందు, దిలీప్ కుమార్ తర్వాత అని చెప్సాల్సి ఉంటుందని అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ చెప్పాడు అంటే దిలీప్ కుమార్, ఎంత పెద్ద లెజెండ్… ఆయన సినిమాకి ఎంత చేశాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీలోనే కాకుండా హాలీవుడ్ లో ఏడు ఆస్కార్లు అందుకున్న లారెన్స్ ఆఫ్ అరేబియాలో అవకాశం వచ్చినా తనకి హిందీ సినిమా చాలు అని ఇక్కడ పరిశ్రమకే అంకితం అయ్యాడు. దాదాపు 65 సినిమాల్లో నటించిన దిలీప్ కుమార్ కి, 1998లో వచ్చిన కిల్లా చివరి చిత్రం అయ్యింది. 1966లో సహ నటి సైరా భానును వివాహం చేసుకున్నారు. కాగా, వీరికి పిల్లలు లేరు. ఉన్న ఇద్దరు తమ్ములు కూడా ఇటివలే కరోనా కారణంగా మరణించారు.
కెరీర్ మొత్తంలో ఎనిమిది సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న దిలీప్ కుమార్, పలు చిత్రాలకు ఆయన జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. సినీపరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను 1991లో పద్మభూషణ్, 1993లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. 1998లో నిషాన్-ఇ-ఇంతియాజ్ అవార్డుతో పాకిస్థాన్ ప్రభుత్వం కూడా దిలీప్ కుమార్ ని సత్కరించింది. 2000 నుండి 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన దిలీప్ కుమార్ గారిని 2015లో పద్మవిభూషణ్ పురస్కారంతో ప్రభుత్వం సత్కరించింది.
ఆయన మృతిపై బాలీవుడ్ తో ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటి మొత్తం సంతాపం తెలిపారు. కాగా, దిలీప్ కుమార్ అంత్యక్రియలను సాయంత్రం 5 గంటలకు ముంబైలోని జుహు శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.