- కాకినాడ తీరం నుంచి వెళ్లేందుకు స్టెల్లాకు అనుమతి ఇచ్చామన్న కలెక్టర్ షాన్ మోహన్
- 55 రోజులుగా కాకినాడ తీరంలోనే స్టెల్లా నౌక
- తనిఖీలో రేషన్ బియ్యం ఉండటంతో ‘సీజ్ ద షిప్’ అంటూ ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
కాకినాడ సముద్రతీరంలో గత 55 రోజులుగా నిలిచిపోయిన స్టెల్లా ఎల్ నౌకకు ఎట్టకేలకు మోక్షం లభించింది. బియ్యం అక్రమ రవాణా నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘సీజ్ ద షిప్’ అంటూ నాడు ఆదేశించడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.
నౌకలో అధికారులు గుర్తించిన రేషన్ బియ్యం అన్ లోడ్ చేసే ప్రక్రియ పూర్తి కావడంతో పాటు నౌక నిలిపినందుకు చెల్లించాల్సిన యాంకరేజ్ చార్జి, కార్గో నౌకలోకి ఎక్కించినందుకు కట్టాల్సిన ఎక్స్ పోర్టు రుసుము పోర్టు అథారిటీకి స్టెల్లా నౌక స్టీమర్ ఏజెంట్ చెల్లించి నోడ్యూస్ ధ్రువీకరణ పొందడంతో కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు.
దీంతో స్టెల్లా నౌక పశ్చిమ ఆఫ్రికా తీరం వెళ్లడానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ విషయాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం ధ్రువీకరించారు. స్టెల్లా నౌక పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిక్ దేశ వాణిజ్య కేంద్రం కొటోనౌ పోర్టుకు బయలుదేరేందుకు అనుమతి ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు