హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో “ఫియర్” మూవీ హైలైట్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు డైరెక్టర్ డా. హరిత గోగినేని
– నాకు సినిమాలంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. బుక్స్ చదివే అలవాటు ఉంది. కొన్ని కథలు రాసుకున్నాను. క్రమంగా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. మూడేళ్ల క్రితం “ఫియర్” సినిమా ఆలోచన మొదలైంది. అయితే అప్పుడు లక్కీ లక్ష్మణ్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం. అది కంప్లీట్ అయ్యాక పూర్తిగా ఈ సినిమా మీదే దృష్టి పెట్టాం.
– వేదిక కంటే ముందు మరికొందరు హీరోయిన్స్ ను అప్రోచ్ అయ్యాం. అయితే వాళ్ల డేట్స్ కోసం ఏడాది పాటు ఆగాలని చెప్పారు. అంత టైమ్ వెయిట్ చేయడం ఇష్టం లేక కొన్నిఆప్షన్స్ చూశాం. వేదిక ముని, కాంచన 3 వంటి మూవీస్ లో బాగా నటించింది. మా సబ్జెక్ట్ కు కూడా చాలా యాప్ట్ అనుకుని ఆమెను సంప్రదించాం. కథ విన్న తర్వాత వేదిక కూడా వెంటనే ఓకే చెప్పింది. నేను అనుకున్న కథలో వేదికను ఊహించుకుంటే ఆమె పర్పెక్ట్ అనిపించింది.
– సినిమా భయం గురించి కాబట్టి ఫస్ట్ టైటిల్ భయం అనే పెట్టాలనుకున్నాం. అయితే అది క్యాచీగా ఉండదని ఫియర్ అని పెట్టా. ఫియర్ అంటే అన్ని భాషలకు రీచింగ్ బాగుంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు యూనివర్సల్ కంటెంట్. అందరికీ నచ్చుతాయి. ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా గుర్తింపు పొందడానికి టైటిల్ ఒక కారణమైంది. ఫిలిం ఫెస్టివల్స్ లో ఎన్ని అవార్డ్స్ వచ్చినా మన తెలుగు ఆడియెన్స్ కు నచ్చితే ఎక్కువ సంతోషాన్నిస్తుంది.
– “ఫియర్” సినిమాను మొదట్లో మల్టీపుల్ లాంగ్వేజెస్ లో చేయాలని అనుకున్నాం. అందరి కంటే ముందే మేము రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా ఆ వారం మరో రెండు చిత్రాలు కూడా రిలీజ్ డేట్ పెట్టుకున్నాయి. సో మాకు మిగతా భాషల్లో ప్రమోషన్ చేసి సెన్సార్ చేసే టైమ్ ఉండదు. కాబట్టి ఈ నెల 14న తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మిగతా భాషల్లో విడుదల చేస్తాం.
– “ఫియర్” సినిమా కంప్లీట్ అయ్యాక మా సర్కిల్ లో వాళ్లకు చూపించాం. వారిలో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎడిటర్స్..ఇలా చాలా మంది ఉన్నారు. వారంతా మూవీ చూసి కొత్త డైరెక్టర్ చేసినట్లు లేదు. చాలా క్వాలిటీగా మూవీ చేశారు అన్నారు. ఆ మాటలు మాకు ఎంతో సంతోషాన్నిచ్చాయి.
– ఈ సినిమా మేకింగ్ పక్కా ప్లానింగ్ తో చేశాను. ఏ సీన్ ఎంత ఉండాలి ఏ షాట్ ఎంత సేపు పిక్చరైజ్ చేయాలని పక్కాగా చేశాం. 2 గంటల ఫుటేజ్ వచ్చింది. ఒక 8 నిమిషాలు ఎడిటింగ్ లో తీసేశాం. డైరెక్టర్ క్లారిటీగా ఉంటే మేకింగ్ లో ఎలాంటి వేస్టేజ్ ఉండదు. నిర్మాత మీద భారం పడదు. ఆర్టిస్టుల డేట్స్ తీసుకునేప్పుడు కూడా ఎన్ని రోజులు షూటింగ్ చేస్తామో చెప్పి మరీ తీసుకున్నాం.
– రెగ్యులర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా “ఫియర్” ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేందుకు ఇష్టపడరు. కానీ మా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది.
– వేదిక పర్ ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎంతో సంతృప్తిగా అనిపించింది. నేను అనుకున్న పాత్రను తను పర్పెక్ట్ గా పర్ ఫార్మ్ చేసింది. అరవింద్ కృష్ణ మేము అడిగిన వెంటనే క్యారెక్టర్ చిన్నదైనా చేశాడు. కథలో నిడివి తక్కువైనా తన క్యారెక్టర్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది.
– అనూప్ రూబెన్స్ గారితో పనిచేయడం చాలా సులువు. ఆయన స్టార్స్ సినిమాలకు పనిచేసినా కొత్త వాళ్లతో వర్క్ చేసేందుకు ఎలాంటి ఈగో చూపించరు. “ఫియర్” మూవీలో బీజీఎం అద్భుతంగా చేశారు.
– మంచి ప్రయత్నం నిజాయితీగా చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. పెద్ద సినిమాలంటే స్టార్స్ తోనే చేయాలి. చిన్న చిత్రాలకు కంటెంట్ బాగుంటే చాలు. నాకు ఈ మూవీ మేకింగ్ టైమ్ లో థియేటర్ కు ఇలా ఉండాలి ఓటీటీకి అలా ఉండాలి అని చాలా చెప్పారు. నేను కథను ఎంత జెన్యూన్ గా రూపొందించాలో అంతే జెన్యూన్ గా చేశా. ఎవరు చెప్పినవి యాడ్ చేయలేదు.
– ఎన్ని మెయిన్ సెంటర్స్ లో మంచి థియేటర్స్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. రిలీజ్ చేసే థియేటర్స్ సంఖ్య తక్కువ ఉన్నా..ప్రేక్షకులు బాగుందని టాక్ వస్తే థియేటర్స్ పెంచుకుంటూ వెళ్తాం.
– నవరసాల్లో అన్ని జానర్స్ కథల లైన్స్ నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మంచి యాక్షన్ మూవీతో పాటు ఒక కామెడీ ఎంటర్ టైనర్ సినిమా నెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాం.