‘వెట్టయన్’ కథకి రజినీ స్టైల్ జోడించడమే సవాల్ : టి.జె. జ్ఞానవేల్

దసరా సందర్భంగా విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ ‘వెట్టయన్ ది హంటర్’ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టయ్యన్ ది హంటర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా నటించిన ఈ చిత్రం థియేటర్లలో దుమ్ములేపేస్తోంది. ఈ మూవీకి ఇంత ఆదరణ దక్కడం, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకుంటూ చిత్రానికి సంబంధించిన విషయాలెన్నో తెలిపారు.

జైలర్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత రజినీకాంత్ గారెతో ఇలాంటి ప్రాజెక్ట్ ఎలా అనుకున్నారు?

రజనీకాంత్ అభిమానులను అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో సినిమాను రూపొందించడమే నా మెయిన్ టార్గెట్. ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ.. ఆయన అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్  మూమెంట్స్‌ను పెట్టాను. ఈ కథకి రజినీ స్టైల్, మ్యానరిజంను జోడించడమే నాకు ఎదురైన సవాల్.

జర్నలిస్టుగా మీకున్న అనుభవం ఈ సినిమాకు ఎలా ఉపయోగపడింది? రజనీకాంత్‌ను ఏమైనా సలహాలు, సూచనలు అందించారా?

రజినీకాంత్‌ను ఎలా చూడాలని, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారనే అవగాహన నాకు ఉంది. నేను ఆయనకు ఓ ఎలివేషన్ సీన్స్ చెబితే.. ఆయన ఫుల్ ఎగ్జైట్ అయ్యేవారు. అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటారో ఆయనకు బాగా తెలుసు. ఆయన నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను.

‘వెట్టయన్‌’లో రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌లను ఎలా బ్యాలెన్స్ చేశారు? 

సూపర్‌స్టార్‌లను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించడం కంటే.. నేను వారి పాత్రల భావజాలాన్ని బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టాను. అమితాబ్ బచ్చన్ పాత్రను మొదట పరిచయం చేశాను. ఆ పాత్ర తాలుకా వ్యక్తిత్వాన్ని చూపెట్టాను. అయితే రజనీకాంత్ పాత్ర మరింత తటస్థ వైఖరితో ప్రారంభం అవుతుంది. వారిద్దరి మధ్య ఉండే భావజాలాల ఘర్షణ ద్వితీయార్ధంలో ఆసక్తికరమైన కథనంగా మారింది.

సినిమా కథ ఎన్‌కౌంటర్లు, న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగింది. వీటిని పరిశోధించడానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఏంటి?

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్‌కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. వాటితో ప్రభావితుడ్ని అయ్యాను. ఈ ఎన్‌కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? దోషుల్నే శిక్షిస్తున్నామా? అనే వాటిని చూపించాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికేసే అమాయకుల్ని ఎన్‌కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. నా పరిశోధనలో పేదలు తరచూ ఇటువంటి ఎన్‌కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు న్యాయం నుండి తప్పించుకుంటారని తెలిసింది. విద్యా వ్యవస్థ లోపాలను కూడా ఈ చిత్రం స్పృశిస్తుంది.

అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ ప్రాజెక్ట్‌కి ఆయన్ని ఎవరు? ఎందుకు ఎంపిక చేశారు?

అనిరుధ్‌కు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసింది. ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడంలో అతను నిష్ణాతుడు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన సంగీతాన్ని అందించడంలో దూసుకుపోతున్నారు. అతను సినిమా సోల్‌ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. దానికి తగ్గ సంగీతాన్ని అందిస్తారు.

ఎన్‌కౌంటర్ నేపథ్యంలో వచ్చిన మలయాళ చిత్రం ‘జన గణ మన’తో పోల్చడం గురించి మీ అభిప్రాయం ఏంటి?

నేను ‘జన గణ మన’ చూశాను. కానీ నా ఉద్దేశ్యం ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ల జీవితాలను వేరే కోణం నుండి చూపించడం. నేను వారి వృత్తి సంక్లిష్టతలను, పరిణామాలను అన్వేషించాలనుకున్నాను.

మీరు నిజ జీవిత ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ గురించి పరిశోధించారా?

నా పరిశోధన ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పులు, మానవ హక్కుల కమిషన్‌తో చర్చలపై దృష్టి సారించడంపై జరిగింది. ఎన్‌కౌంటర్ల చట్టపరమైన, నైతిక అంశాలను అర్థం చేసుకోవడానికి ఇవి బలమైన పునాదిని అందించాయి.

సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్‌ని సీరియస్ కథతో ఎలా బ్యాలెన్స్ చేసారు?

అలా బ్యాలెన్స్ చేయడమే అతి కష్టమైన పని. ‘వెట్టయన్’ వినోదాన్ని కోరుకునే రజనీకాంత్ అభిమానులకు, ఆలోచింపజేసే కథనాలను మెచ్చుకునే ప్రేక్షకులకు ఇలా అందరికీ నచ్చుతుంది. నేను రాజ్యాంగం, న్యాయ ప్రక్రియ యొక్క శక్తిని విశ్వసిస్తాను. అదే మీకు సినిమాలోనూ కనిపిస్తుంది. రజనీకాంత్‌ నుంచి కోరుకునే యాక్షన్ సీక్వెన్స్‌లను కథనంలో అంతర్లీనంగా ఉండేలా చూసుకున్నాను.

ప్యాట్రిక్ పాత్రకు ఫహద్ ఫాజిల్ మాత్రమే కరెక్ట్ అని అనుకున్నారా?

ఖచ్చితంగా. ఆ పాత్రకు ఫహద్ సరైన ఎంపిక. పాత్రకు కీలకమైన ఇంటెన్సిటీ, డెప్త్ తీసుకొచ్చారు.

ఫహద్ పాత్ర కథా కథనాన్ని ఎందుకు అలా ముగించారు?

ఫహద్ పాత్ర స్క్రీన్ ప్లేలో కీలకంగా ఉంటుంది. అతను దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యవస్థకే అతను బాధితుడయ్యాడు.

ఈ కథ రాయడానికి మీ స్పూర్తి, ప్రేరణ ఏంటి?

నిజ-జీవిత ఎన్‌కౌంటర్ కేసుల నుండి ప్రేరణ పొందాను. అటువంటి సంఘటనల చుట్టూ ఉన్న నైతిక సంక్లిష్టతలను జోడించి కథ రాయాలని అనుకున్నాను.

‘జైలర్‌’తో బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన తర్వాత రజినీకాంత్‌ని ఎలా ఒప్పించారు?

రజినీకాంత్ గారి కూతురు నా దగ్గరకు వచ్చారు. తన తండ్రికి సరిపోయే కథలు ఉన్నాయా అని ఆరా తీశారు. నాకు అదే ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఆయన నా శైలిని అర్థం చేసుకున్నారు. నాకు కావాల్సిన క్రియేటివ్ ఫ్రీడంను ఇచ్చారు. 

నటరాజ్ పాత్ర కోసం మీ దృష్టిలో ఇంకా వేరే నటీనటులు ఎవరైనా ఉన్నారా?

రానా దగ్గుబాటి నా ఫస్ట్ ఛాయిస్. కథ రాస్తున్నప్పుడే ఆయన్ను అనుకున్నాను. కానీ అతని షెడ్యూల్ క్లాష్ అయింది. ఫహద్ డేట్స్ మారడంతో రానా డేట్లు కూడా దొరికాయి. అలా నా కథకు కావాల్సిన వారంతా అలా దొరికారు. 

‘జై భీమ్’ నుంచి ‘వెట్టయన్’కి ఎలా మారారు?

‘జై భీమ్’ తర్వాత సూర్యతో ఒక ప్రాజెక్ట్ లైన్‌లో ఉంది, కానీ రజనీకాంత్ గారితో పనిచేసే అవకాశం వచ్చింది. ‘జై భీమ్’ ఓ సెక్షన్ ఆడియెన్స్‌ను మాత్రమే ప్రతిధ్వనిస్తుండగా.. రజినీకాంత్ సినిమాకు ఉండే విస్తృత అంచనాలను అందుకోవాలని ముందే ఫిక్స్ అయ్యాను. అందుకే నేను ఓ యాభై శాతం వినోదం.. యాభై శాతం సందేశం ఉండాలని ఇలా కథను రాసుకున్నాను. అయితే నేను ఏ విషయంలోనూ రాజీ పడలేను.

‘వెట్టయన్’కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా?

నేను ప్రీక్వెల్‌ను చేయడానికి ఎక్కువ ఆసక్తితో ఉన్నాను. ‘వెట్టయన్: ది హంటర్’ అతియాన్ గురించి చెబుతుంది. అయితే అతియాన్ ఎలా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయ్యారనే కథను చెప్పాలని అనుకుంటున్నాను. ఫహద్ ఫాసిల్ దొంగగా, పోలీసు ఇన్‌ఫార్మర్‌గా మారడం, ఇలా ఈ కథలోని చాలా అంశాలకు బ్యాక్ స్టోరీని చెప్పాలని అనుకుంటున్నాను.

మీ రాబోయే ప్రాజెక్ట్‌లు ఏమిటి?

నా దగ్గర కొన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, కానీ నేను ప్రస్తుతం ‘వెట్టయన్’పై దృష్టి పెడుతున్నాను. నవంబర్ మొదటి వారంలో నేను నా భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి చెబుతాను

సూర్య ‘వెట్టయన్’ చూసి ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారా?

‘కంగువ’ సినిమా కోసం ఆయన విదేశాల్లో ఉన్నారు. కానీ విడుదల తేదీని ప్రకటించగానే సోషల్ మీడియాలో నన్ను అభినందించారు. ఈ చిత్రానికి వ్యక్తిగతంగా కూడా తన మద్దతును తెలిపారు. నా పని, నా విజన్ గురించి అతనికి తెలుసు.

చివరగా ఏం చెప్పాలని అనుకుంటున్నారు?

‘వెట్టయన్’కి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్న ఆడియెన్స్‌కు కృతజ్ఞతలు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించడం చూస్తుంటే ఆనందంగా ఉంది. సినిమాలో నేను లేవనెత్తిన అంశాల గురించి చర్చలు జరుగుతాయని నేను భావిస్తున్నాను.