లాక్డౌన్తో సినిమా ధియేటర్లు మూతపడగా.. కరోనా ప్రభావం తగ్గడంతో ఇటీవల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా క్రమంలో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే థియేటర్లన నడుపుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. థియేటర్లలో కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజ్ చేసుకోవడం లాంటి కరోనా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. దీంతో కరోనా నిబంధనలతో సినిమా ధియేటర్లు నడుస్తున్నాయి.
కానీ థియేటర్లలో 50 శాతం ఆక్యూపెన్సీ వల్ల సినిమాలు విడుదల చేస్తే నష్టాలు తప్ప లాభాలు ఉండవని సినీ నిర్మాతలు చెబుతున్నారు. థియేటర్లలో 100 శాతం ఆక్యూపెన్సీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 100 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
థియేటర్లలో 100 శాతం ఆక్యూపెన్సీకి అనుమతి ఇవ్వాలని ఇటీవల తమిళనాడు ప్రభుత్వాన్ని నిర్మాతలు డిమాండ్ చేశారు. ఇక హీరో విజయ్ స్వయంగా సీఎంని కలిసి కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి సానుకూలంగా నిర్ణయం రావడంతో సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
తమిళనాడులో మొత్తం 799 థియేటర్లలో 1102 స్క్రీన్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో లాక్డౌన్ వల్ల కొన్ని ఆగిపోయాయి. సంక్రాంతికి విడుదల కానున్న ‘మాస్టర్ సినిమా’ను 700 నుంచి 800 వరకు స్క్రీన్లలో విడుదల చేసే అవకాశముంది. ఇక శింబు హీరోగా వస్తున్న ఈశ్వరన్ సినిమాను 200 నుంచి 250 వరకు స్క్రీన్లలో విడుదల చేసే అవకాశముంది.