Sonusood: ప్రముఖ నటుడు సోనూసూద్ తన ఆరంతస్తుల భవనాన్ని హోటల్‌గా మార్చారంటూ బీఎంసీ అధికారులు ఆయనకు నోటీసులు.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీఎంసీ అభ్యంతరాలను సవాల్ చేస్తూ సోనూసూద్ కోర్టును ఆశ్రయించారు. అయితే దిగువ కోర్టు ఆయన అభ్యర్థనను నిరాకరించడంతో హైకోర్టుకు వెళ్లారు. కానీ అక్కడ కూడా సోనూకు నిరాశ ఎదురైంది. బాంబే హైకోర్టు సోనూసూద్ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ క్రమంలో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై సోనూసూద్ తరపున న్యాయవాది వినీత్ ధందా మాట్లాడుతూ.. తన క్లైయింట్ పట్ల బీఎంసీ అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటివి చేసిందని, లాక్‌డౌన్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన సోనూసూద్ ఇమేజ్‌కు భంగం కలిగేలా వ్యవహరించిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాం. సోనూసూద్ చట్టాన్ని అతిక్రమించలేదని, నిబంధనలకు లోబడే నడుచుకున్నారని పేర్కొన్నారు. పలు సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోనూసూద్. ఇలాంటి నిజాయితీ వున్న నటుడి వైపు న్యాయం ఎక్కడ ఉంది అని సోషల్ మీడియాలో సోనూకు సపోర్టుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.