ప్రఖ్యాత నటుడు, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా కెరీర్‌ను ప్రారంభించిన దుల్కర్ సల్మాన్.. అనతి కాలంలోనే తన ప్రత్యేకతను చాటుకొని, వివిధ భాషల ప్రేక్షకుల మనసు గెలుచుకొని పాన్-ఇండియా నటుడిగా ఎదిగారు. గత 12 సంవత్సరాలుగా తన నటనతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దుల్కర్.. ఇప్పటికే చిరస్థాయిగా నిలిచిపోయే పలు చిత్రాలను అందించారు.
దుల్కర్ సల్మాన్ తన తదుపరి చిత్రం ‘లక్కీ భాస్కర్’ కోసం.. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అద్భుతమైన చిత్రాలను అందించే ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు. వినోదభరితమైన మరియు హృదయాన్ని కదిలించే కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రచయిత, దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
నటుడిగా దుల్కర్ సల్మాన్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ‘లక్కీ భాస్కర్’ నుండి తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్న లుక్‌లో దుల్కర్ కనిపిస్తున్నారు. 80ల కాలం నాటి బొంబాయి(ముంబై) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ తెలిపారు.
సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి, ఈ సినిమా అంతా ఒక సాధారణ మనిషి యొక్క అసాధారణమైన ప్రయాణం గురించి అని నిర్మాతలు చెబుతున్నారు. విభిన్న కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి శాయశక్తులా కృషి చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సార్(వాతి) వంటి ఘన విజయం తర్వాత వెంకీ అట్లూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో.. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన చిత్రాన్ని అందించాలని నిర్మాతలు భావిస్తున్నారు. ‘లక్కీ భాస్కర్’ ఎటువంటి సందేహం లేకుండా ప్రేక్షకులను మెప్పించే గొప్ప చిత్రం అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ – వెంకీ అట్లూరి కలయికలో వచ్చిన సార్(వాతి) వంటి చిరస్మరణీయ ఆల్బమ్ తర్వాత, ‘లక్కీ భాస్కర్’తో మరో చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అందించాలని చూస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
యువ అందాల తార మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి, నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
తారాగణం: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
కూర్పు: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్