‘యాత్ర-2’ ట్రైలర్ విడుదల – ట్రైలర్ ఏం చెప్తుంది అంటే…..

మలయాళ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన చిత్రమే ‘యాత్ర’. ఇది సూపర్ హిట్ అవడంతో దీనికి ఇప్పుడు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ మూవీని రూపొందిస్తున్నారు. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో జీవా హీరోగా నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.

‘యాత్ర 2’ సినిమాను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల లక్ష్యంతో రూపొందిస్తున్నారు. అందుకే ఎంతో వేగంగా ఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసుకున్నారు. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం స్పీడుగానే జరుపుతున్నారు. ఇలా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేసింది.

‘యాత్ర 2’ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు టీజర్ కూడా విడుదలైంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్‌ను వదిలారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఓ సన్నివేశంతో దీన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆయన మరణించడం.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాలని డిసైడ్ అవడం చూపించారు.

‘యాత్ర 2’ ట్రైలర్‌లో సైతం సోనియా గాంధీ, చంద్రబాబు పాత్రలు కుట్రలు చేసినట్లుగా చూపించారు. ఆ తర్వాత పార్టీని స్థాపించి పాదయాత్ర చేయడం.. అసెంబ్లీలో అడుగు పెట్టడం హైలైట్ చేశారు. మొత్తానికి ఈ ట్రైలర్ మాత్రం రియల్ ఇన్సిడెంట్లతో సాగే కమర్షియల్ సినిమాలా కనిపించింది. అందుకే ఇది అన్ని వర్గాల వాళ్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీని ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేస్తున్నారు.