‘సీతారాం సిత్రాలు’ సినిమా జెన్యూన్ రివ్యూ

లక్ష్మణ్ మూర్తి, బ్రమరాంబిక ప్రధాన పాత్రలో నటిస్తూ నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వంలో ఈనెల 30న విడుదలైన సినిమా సీతారాం సిత్రాలు. పార్థసారథి, నాగేంద్ర రెడ్డి, కృష్ణ చంద్ర విజయబట్టు నిర్మాతలుగా రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాకు పర్వతనేని అరుణ్ కుమార్ డిఓపిగా పనిచేయగా ఎమ్మెస్ దుర్గ కిరణ్ సంగీతాన్ని అందించారు. ఎడిటర్ గా ప్రణీత్ కుమార్, అలాగే జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే…

కథ: టీ అమ్ముకునే వ్యక్తికి ఓ చదువుకున్న టీచర్ పెళ్లి సంబంధం వస్తుంది. కానీ ఆ పెళ్లి ఆగిపోవడంతో అక్కడినుండి వారి జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ చిత్ర కథ. జీవితంలో ఎదగడానికి గాను హీరో ఎటువంటి కష్టాలు పడ్డాడు? అలా కష్టపడుతూ ఉండగా అతనికి ఎటువంటి కష్టాలు ఎదురయ్యాయి? ఆ కష్టాలను హీరో ఎలా అధిగమించాడు? అనేది సినిమా కథ.

నటీనటుల నటన:

హీరోగా చేసిన లక్ష్మణ మూర్తి తన పాత్రకు న్యాయం చేశాడు. మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, జీవితంలో సక్సెస్ అవడం అనే రెండు లక్ష్యాలున్న యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. టీమాస్టర్ పాత్రను చాలా ఈజ్‌తో చేశాడు. ఒక హీరోయిన్ భ్రమరాంబిక తన అందంతో ఆకట్టుకుంది. టీచర్ పాత్రలో హుందాగా కనిపించింది. తన హావభావలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఈ సినిమాతో ఈమెకు మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. హీరో తల్లి పాత్రలో నటించిన ఢిల్లీ రాజేశ్వరి తన పాత్రను చక్కగా పండించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేరకు నటించారు. దర్శకుడు నాగ శశిధర్ నూతన నటీనటులతో చేసిన ఈ ప్రయత్నం బాగుంది. దర్శకుడిగా తీను చెప్పాలనుకున్న పాయింట్‌ను సూటిగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. అరుణ్ కుమార్ పర్వతనేని సినిమాటోగ్రఫీ కనువిందుగా ఉంది. రుద్ర కిరణ్ ఇచ్చిన సంగీతం రణగొణ ధ్వనులకు విరుద్ధంగా వినసొంపుగా ఉంది. నిర్మాతలు పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి, కృష్ణ చంద్ర విజయ బట్టు సీతారాం సిత్రాలను కుటుంబంతో కలిసి చూసేలా నిర్మించారు. తలనొప్పి వచ్చినప్పుడు చక్కటి టీ తాగితే ఎంత ఉపశమనం కలుగుతుందో.. కుటుంబంతో కలిసి ఈ సినిమా చూస్తే అలాంటి ఫీల్ కలుగుతుంది.

సాంకేతిక విశ్లేషణ:

ప్రస్తుతం వయలెన్స్, రొమాన్స్ ఎక్కువ ఉన్న సినిమాలు వస్తున్నాయి. దీంతో కుటుంబంతో కలిసి చూసే సినిమాలు తగ్గిపోయాయి. అందుకే దర్శకుడు నాగ శశిధర్ కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాను సీతారాం సిత్రాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. చిన్న సినిమాల్లోనే ప్రస్తుతం కంటెంట్ బాగా ఉంటోంది. సీతారాం సిత్రాలులో కూడా కంటెంట్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో నిశ్చితార్థం, పెళ్లి, నామకరణం లాంటి శుభకార్యాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో తీసిన ఫొటోలను, వీడియోలను మధుర జ్ఞాపకాలుగా దాచుకుంటారు. అయితే గతంలో వీసీఆర్ క్యాసెట్‌లో వాటిని భద్రపరిచేవారు. ప్రస్తుతం వీసీఆర్ ప్లేయర్స్ ఎవరి ఇళ్లలోనూ లేవు. కాలం మారుతున్న కొద్దీ సీడీలు, పెన్‌డ్రైవ్‌లు, చిప్‌లు వచ్చేశాయి. ఈ పాయింట్‌ను తీసుకుని దర్శకుడు నాగ శశిధర్ కథను నడిపించాడు. వీసీఆర్ క్యాసెట్ నుంచి నుంచి సీడీకి, పెన్‌డ్రైవ్‌కు డేటాను ట్రాన్స్‌ఫర్ చేసే ప్రక్రియను చూపించాడు. ఇది చిన్న సినిమా అయినా ఎన్నో విషయాలను దర్శకుడు ఇందులో స్పృశించాడు. మనసుకు నచ్చిన పనిని మరింత ఇష్టంగా చేస్తే విజయం వరిస్తుందని చూపించాడు. బంధువులు అనేవాళ్లు మాటలు చెప్పడానికే కానీ, మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేందుకు పనికిరారనే జీవిత సత్యాన్ని చెప్పాడు డైరెక్టర్. అలాగే స్నేహితులు కూడా మనల్ని నమ్మించి ఎలా మోసం చేస్తారో చూపించాడు. ఆడవాళ్లు సీరియల్స్ మాయలో పడి ఇంట్లో వాళ్లను కూడా అందులోని పాత్రలుగా ఊహించుకోవడం ఎలా ఉంటుందో చూపించాడు.మొత్తంగా దర్శకుడు నాగ శశిధర్ తను ఎంచుకున్న పాయింట్‌ను చెప్పడంలో ఎక్కడా తడబడకుండా కథను నడిపించాడు. అయితే సెకెండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత పకడ్బందీగా రాసుకుని ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేది. అలాగే ముఖ్య పాత్రల్లో కొంచెం తెలిసిన వాళ్లను తీసుకుని ఉంటే సినిమా స్థాయి కూడా పెరిగేది. కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో చాలా వరకు ఫ్యాక్షన్ సినిమాలు వస్తే.. డైరెక్టర్ నాగ శశిధర్ మాత్రం కొత్త పంథాలో సందేశాత్మక చిత్రాన్ని అందించాడని చెప్పొచ్చు. ప్రస్తుతం చాలా మంది యువత ప్రేమలో ఓడిపోతే కుంగిపోవడం, జీవితంలో సక్సెస్ రాకపోతే కృశించిపోవడం చేస్తున్నారు. అలాంటి వాళ్లు నిరుత్సాహం నుంచి బయటకు వచ్చి జీవితంలో ఎలా విజయం సాధించాలో చెప్పే ఈ చిత్రాన్ని యూత్ తప్పక చూడాలి. ఓటిటికి మంచి కంటెంట్ ఉన్న సినిమాగా కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

కథ, డైలాగ్, మాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

రెండవ భాగం సాకతీత, పెద్ద కాస్టింగ్ లేకపోవడం

కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రం.