తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలైన మొదటి పెద్ద హీరో సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. కరోనా క్రమంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా?.. లేదా?.. అనే అనుమానాలు సినీ వర్గాల్లో ఉన్నాయి. దీంతో సినిమాలను విడుదల చేసేందుకు చాలామంది నిర్మాతలు వెనకడుగు వేశారు. అలాంటి సమయంలో సినిమా రిలీజ్ చేసి సాయిధరమ్ తేజ్ సాహసం చేశాడు. అందుకే ఈ సినిమాకు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేసింది. సినిమా హిట్ కావాలని సెలబ్రెటీలందరూ ట్వీట్లు చేశారు.
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. జీ స్టూడియో ఈ సినిమా రైట్స్‌ను కొనుగోలు చేసి విడుదల చేయగా.. తొలి వీక్‌లో రూ.10 కోట్ల వరకు కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. సినిమాకు మంచి టాక్ రావడంతో ఇంకా ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
ఈ క్రమంలో జీ స్టూడియోస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన జీ ప్లెక్స్‌లో జనవరి 1న రిలీజ్ చేయాలని జీ స్టూడియో నిర్ణయించింది. రూ.149 చెల్లించి జీ ప్లెక్స్‌లో సినిమా చూడవచ్చు. జీ5 సబ్‌స్కైబర్స్‌కు ఫిబ్రవరి నుంచి ఫ్రీగా చూసే సదుపాయాన్ని కల్పించనుంది. ఈ సినిమాను సుబ్బు తెరకెక్కించగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. నభా నటేష్ ఇందులో హీరోయిన్గా నటించింది. జీ స్టూడియోస్ ఈ సినిమాకు సంబంధించిన అన్ని హక్కులను సొంతం చేసుకుంది.