బాలయ్యని ఢీ కొట్టనున్న బాలీవుడ్ స్టార్, ఇది బోయపాటి మాస్టర్ ప్లాన్

నందమూరి నట సింహం బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిశారు అంటే థియేటర్స్ లో విజిల్స్ మోతమోగడం ఖాయం. ముందుగా సింహా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబినేషన్, ఆ తర్వాత కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలన్నట్లు లెజెండ్ చేశారు. బాలయ్య కెరీర్ లో లెజెండ్ సినిమా ఒక మైల్ స్టోన్ గా మిగిలిపోతుంది. 400 రోజులు ఆడిన లెజెండ్ సినిమాతో ఫ్యామిలీ హీరో జగపతి బాబు విలన్ గా మారాడు. బాలయ్య, జగపతి బాబు మధ్య సీన్స్ లెజెండ్ సినిమాకి ప్రాణం పోశాయి. అంతేకాదు కెరీర్ అయిపొయింది అనుకున్న జగపతి బాబుని మోస్ట్ బిజియస్ట్ యాక్టర్ ని చేసింది. జగపతి బాబుని ఆన్ స్క్రీన్ చూసిన వాళ్లు, బాలయ్యకి సరైన విలన్ దొరికాడు అన్నారంటే జిత్తు భాయ్ పాత్రని బోయపాటి ఎంత గొప్పగా మలిచాడో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఈ ఊరమాస్ కాంబినేషన్ గత రెండు చిత్రాలని మించే రేంజ్ హిట్ కొట్టడానికి కలిసి వస్తున్నారు. రీసెంట్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అయిన ఈ సినిమా కోసం బాలయ్య 10 కేజీల బరువు కూడా తగ్గుతున్నాడు. బలమైన ప్రతినాయకుడు ఉంటే, వాడిని కొట్టే నాయకుడి విలువ పెరుగుతుంది. అందుకే నందమూరి హీరో బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా పట్టిన బోయపాటి శ్రీను, సంజయ్ దత్ ని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నాడు. నార్త్ లో హీరోగా చేస్తూనే, సౌత్ లో స్పెషల్ రోల్స్ చేస్తున్న సంజయ్ దత్ ప్రస్తుతం కేజీఎఫ్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. బోయపాటి, సంజయ్ దత్ ని ఒప్పిస్తే మాత్రం 21 ఏళ్ల తర్వాత, దత్ నటిస్తున్న సినిమా ఇదే అవుతుంది. గతంలో నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమాలో సంజయ్ దత్ క్యామియో ప్లే చేశాడు, ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ చేయడానికి రెడీ అవుతాడో లేదో చూడాలి.