లీడింగ్ విమెన్ జాయింట్ వెంచర్ ‘యువర్ లైఫ్’

వెబ్ సైట్ అతిథి సంపాదకురాలిగా స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్ సమంత అక్కినేని పేరుని ప్రకటించారు యుఆర్ లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్, ఉపాసన కామినేని కొణిదెల. URLife.co.in అనే వెబ్ సైట్ ను ఉపాసన కొణిదెల ప్రారంభించారు. టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకుంటూ, అర్హులైన నిపుణుల నుండి నిర్దుష్టమైన సమాచారాన్నిఅందుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి అంశాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించి, ప్రజలు తమ జీవితాలను పరిపూర్ణంగా ఆరోగ్యకరంగా సాగించేలా స్ఫూర్తిని అందించాలనే లక్ష్యంతో ఉపాసన ఈ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నారు.
యుఆర్ లైఫ్ బృందంలోని అర్హులైన ఆరోగ్య నిపుణులు, ఫిట్నెస్ నిపుణులు, ఇంకా సంపూర్ణమైన పోషక పదార్థాల నిపుణులు, అంతా కలిసి తమ పాఠకులకు ప్రస్తుత కాలానికి తగిన ఆరోగ్య సూత్రాలను, పోషకాల గురించిన వీడియోలను, ఆహార నియమాల ప్రణాళికలను, జీవనశైలి సలహాలను, సూచనలను, ఆరోగ్యాన్ని పెంచే వంటలను, మీకై మీరు ఉత్సాహంగా చేసుకునే వ్యాయామాలను, ఇంకా పాఠకులు ఎల్లప్పుడూ ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండేందుకు వ్యక్తిగతమైన సేవలను కూడా అందిస్తూ వారికి ఉన్న బడ్జెట్ పరిమితులలోనే ఆరోగ్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని, సూచనలను అందిస్తున్నారు.

“URLife.co.in వెబ్ సైట్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం, ముఖ్యంగా – ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం, మానసిక, భావోద్వేగాల సమతుల్యత వంటి నేను గాఢంగా నమ్మే కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే. మా ఈ విలువలను గౌరవించే వారిలో సమంత కూడా ఒకరు. ఆమె కూడా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పర్యావరణ రక్షణని ప్రోత్సహిస్తున్నారు, పూర్తి శాకాహారపు జీవనాన్ని అనుసరిస్తూ, ఆరోగ్యం ఇంకా ఫిట్నెస్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆమె నైపుణ్యం మా పాఠకులకు చేరువ అవుతుందని ఆకాంక్షిస్తున్నాము. శారీరక, మానసిక ఆరోగ్యం గురించి, పోషకాల గురించి, చికిత్స గురించి ఆమె సూచనలు, సలహాలు మా పాఠకులకు అందుతాయని ఆశిస్తున్నాం” అని ఉపాసన పేర్కొన్నారు.
భారతదేశపు కార్పొరేట్ రంగంలో సుమారు కోటి నలభై లక్షల మందికి జీవనశైలి సూచనలు, సలహాలు అందిస్తూ దేశంలోనే అతిపెద్ద ఆరోగ్య సేవలు అందిస్తున్న సంస్థల సౌజన్యంతో URLife.co.in అనే వెబ్ సైట్ నిర్వహించబడుతోంది. నిపుణుల సలహాలు, ఉపయుక్తమైన సమాచారం, పాఠకులు సైతం పాల్గొనే అంశాలు ఇంకా సెలబ్రిటీల ప్రేరణ ఈ వెబ్ సైట్ ద్వారా అందుతున్నాయి. మన దేశంలోనే అతి చిన్న వయస్సులోనే డైనమిక్ ఆరోగ్య సూత్రాల నిపుణురాలిగా ఎదిగిన ఉపాసన కొణిదెల మార్గనిర్దేశకత్వంలో ఈ వెబ్ సైట్ రూపొందింది. అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్, యుఆర్ లైఫ్, ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ టిపిఎ సంస్థలో విశేషమైన అనుభవం గడించిన ఉపాసన సారథ్యంలో URLife.co.in నిర్వహించబడటం విశేషం.