మూవీ మేకింగ్ మాస్టర్ రాజమౌళి, మాస్ హీరోలు ఎన్టీఆర్ చరణ్ కలయిక వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్. ఈ మూవీ నుంచి ఫ్రెండ్షిప్ సాంగ్ బయటకి వచ్చింది. అన్ని భాషల్లోని టాప్ మోస్ట్ సింగర్స్ పాడిన ఈ పాట యుట్యూబ్ సెన్సేషన్ గా మారింది. తెలుగులో హేమ చంద్ర పాడిన సాంగ్ దాదాపు 6.5 మిలియన్ వ్యూస్ రాబట్టి టాప్ ట్రెండింగ్ లో ఉంది. సాంగ్ ఎండ్ లో చరణ్, ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో రావడం ఈ సాంగ్ కి హైలైట్ అయ్యింది. ఇది ఫ్రెండ్షిప్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది కానీ ఈ పాటలోని లిరిక్స్ ని గమనిస్తే… ఇది టు అపోజిట్ పోల్స్ మధ్య, వారి క్యారెక్టర్స్ ని ప్రెజెంట్ చేస్తూ, ఇలాంటి ఇద్దరు డిఫరెంట్ నేచర్ ఉన్న వాళ్లు ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటుంది? అది ఎక్కవ రోజులు నిలబడుతుందా? ఈ ఇద్దరూ కలిస్తే భవిష్యత్తులో రాబోయే సమస్యలు ఏంటి అనే విషయాలని చెప్పారు.
ఒకసారి ఈ దోస్తీ పాటలోని లిరిక్స్ గమనిస్తే… పులికి విలుకాడికి, తలకి ఉరితాడుకి, కదిలే కార్చిచుకి – కసిరే వడగల్లకి, రవికి మేఘానికి దోస్తీ అని మొదటి చరణంలో ఉంది. ఈ లైన్స్ ని అబ్సర్వ్ చేస్తే ఇక్కడ పులి అంటే గోండు బెబ్బులి కొమురం భీమ్ అని, విలుకాడు అంటే బాణం పట్టుకున్న వాడు సీత రామరాజు అని అర్ధం. పులికి వేటగాడికి అసలు పడదు, ఒకరిని ఒకరు వేటాడుతూ ఉంటారు. ఈ ఇద్దరూ ఎదురు పడితే పులి అయినా మిగలాలి లేక వేటగాడు అయినా మిగలాలి… తర్వాత లైన్ లో తలకి ఉరి తాడుకి అని ఉంది. తల ఉరి కలిసే సమయం వస్తే ప్రాణం పోవడమే మిగులుతుంది. కదిలే కార్చిచ్చు అంటే ఉధృతంగా కదులుతున్న మంటలు… కసిరే వడగళ్ళు అంటే హోరుగా పడుతున్న వడగళ్ళు అని… భగభగ మండే నిప్పులు ఆరాలి అంటే అంతకు మించిన నీళ్ళు కానీ వర్షం కానీ కావాలి. మంటలకి వర్షం తగిలితే అది ఆరిపోతుంది. రవికి అంటే సూర్యుడు వెలుగుతూ ఉన్నప్పుడు దాని కప్పేసేది మేఘమే… ఎంతటి ఎండ అయినా మేఘం అడ్డొస్తే కనిపించదు. ఇలాంటి రెండు భిన్న దృవాలకి దోస్తీ అంటే జరగని పని… ఇది నిజంగా విచిత్రమే అందుకే నెక్స్ట్ చరణంలో అదే రాశారు.
ఊహించని చిత్ర విచిత్రం, స్నేహానికి చాచిన హస్తం, ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో… బడభాగ్నికి జడివానకి దోస్తీ, విధిరాతకి ఎదురీతకి దోస్తీ, పెను గాలికి హిమనగమిచ్చిన కౌగిలి దోస్తీ. ఈ చరణంలో ఈ విచిత్రంగా ఈ రెండు దృవాలు స్నేహం కోసం చేతులు చాచారు, ఈ స్నేహం ప్రాణం ఇస్తుందా లేక ప్రాణం తీస్తుందా అనే భయం కలిగిస్తూ రెండో లైన్ రాశారు. నిప్పు, నీరు కలవకూడదు అని విధి రాసిన రాతకి ఈ స్నేహం ఎదురీత లాంటిది. అసలు ఈ నీరు నిప్పు ఎందుకు, ఏ పరిస్థితిలో కలవాల్సి వచ్చింది అనేది కూడా చెప్తూ ఆఖరి చరణం రాశారు.
అనుకోని గాలి దుమారం… చెరిపింది ఇరువురి దూరం, ఉంటారా ఇకపై ఇలాగా వైరమే కూరిమై. ఇక్కడ ఊహించని సంఘటన ఎదో జరిగి ఈ నీరు నిప్పు లాంటి అల్లూరి సీత రామరాజు, కొమరం భీమ్ ల మధ్య ఉన్న దూరం తగ్గించింది. దూరం అయితే తగ్గింది కానీ ఈ ఇద్దరూ ఇలానే కలిసి ఉంటారా? వైరం మర్చిపోయి స్నేహంగా ఉంటారా? అనేది ఆలోచించాల్సిన విషయమే. ఇది వారి స్వభావానికి కష్టమైన పని కాబట్టే తెగిపోదా స్నేహమే ద్రోహమై అని నెక్స్ట్ లైన్ లోనే పెట్టారు. ఇక్కడ ద్రోహం అంటే మోసం కాదు… ద్రోహం అంటే స్నేహాన్ని వదిలి వెళ్ళిపోతారా అనే అర్ధం వచ్చేలా ఆ పదాన్ని వాడారు. రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా నీరు నిప్పు లాంటి ఈ ఇద్దరూ కలిశారు కాబట్టి భవిషత్తులో ఏం జరగబోతుంది అనే భయం కలిగిస్తూ ఆఖరి లైన్ ని ఇలా రాశారు… ముందుగా తెలియదు ఎదురు వచ్చే మలుపులేవో… అని ముగించారు.
పైన రాసిన, విన్న ఈ లిరిక్స్ ని గమనిస్తే… అసలు పొంతన లేని ఈ ఇద్దరూ ఎలా కలుస్తారు? ఎలాంటి పరిస్థితిలో కలిశారు? ఇకపై కూడా కలిసే ఉంటారా అనేది పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారు. కీరవాణి మ్యూజిక్ కి, హేమ చంద్ర వాయిస్ బాగా సెట్ అయ్యి సాంగ్ అందరికీ నచ్చేలా చేసింది.