‘రాజాకర్’ సినిమా రహస్యాలు బయట పెట్టిన సినిమా హీరోయిన్ అనుశ్రీ


‘చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రజ‌లే సాయుధులై క‌ద‌న రంగంలోకి దూకి చేసిన పోరాటం.. ఇప్పటికీ స‌జీవం. అలాంటి కథను ‘ర‌జాకార్’ రూపంలో భావోద్వేగ‌భ‌రితంగా తెర‌పై చూపించిన ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన ఆనందాన్ని ఇచ్చింది. ఈ చిత్రంలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా సంతోషాన్ని ఇచ్చింది” అన్నారు నటి అనుశ్రీ. బాబీ సింహా, మకరంద్ దేశ్ పాండే, అనుశ్రీ, అనసూయా, ప్రేమ, ప్రధాన పాత్రలో, యాట సత్యనారాయణ దర్శకత్వంలో, గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘ర‌జాకార్’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ నేపధ్యంలో ఇందులో కీలక పాత్ర పోషించిన అనుశ్రీ చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మీ నేపధ్యం గురించి చెప్పండి? ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
నేను బెంగళూరులో కాలేజ్ చదివాను. అక్కడే థియేటర్స్ గ్రూప్ లో కూడా ఒక సభ్యురాలిగా వున్నాను. అక్కడే నటనపై ఆసక్తి పెరిగింది. విభిన్న పాత్రలలో నటించడం, ఆ పాత్రలలో లీనం అవ్వడం నాకు చాలా నచ్చింది. కాలేజ్ పూర్తయిన తర్వాత నేను సివిల్స్ కి చదవాలని నాన్నగారు కోరుకున్నాను. దాదాపు మూడేళ్ళు చదువుల్లోనే వున్నాను. అయితే నటిని కావాలనే కోరిక బలంగా వుండేది. ఆ కలని నెరవేర్చడం కోసం హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ థియేటర్స్ వర్క్ షాప్స్ చేశాను. ఈ సినిమా లో పాత్ర కోసం దర్శకుడిని సంప్రదించాను. అప్పుడు ఆయన నిజాం భార్యగా నటించే పాత్ర కోసం వెదుకుతున్నారు. ఆ పాత్రకు నేను సరిపోతానని భావించారు.

ఈ పాత్ర చేయడం సవాల్ గా అనిపించిందా?
ఇందులో నిజాం భార్యగా కనిపించా.  చాలా బలమైన అదే సమయంలో సున్నితమైన పాత్ర ఇది. వాస్తవ పరిస్థితులని నిజాంకు తెలియజేసే ఆ పాత్ర. కథ చెప్పినపుడు నా పాత్ర సవాల్ గా అనిపించింది. అలాగే ఇందులో వున్న ఏకైక గ్లామర్ రోల్ నాదే. ఇలాంటి బలమైన కథ, పాత్రతో నా కెరీర్ ప్రారంభం కావడంతో నా కల నెరవేరినట్లయింది. ఈ పాత్ర కోసం మూడు నెలలు పాటు మెథడ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. మకరంద్ దేశ్ పాండే గారితో లుక్ టెస్ట్ చేసి ఓకే అనుకున్న తర్వాతే నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఈ పాత్ర నా కెరీర్ గొప్పగా కలిసొస్తుందని భావిస్తున్నాను.  

‘ర‌జాకార్ ‘ చిత్రానికి వస్తున్న స్పంధన ఎలా అనిపిస్తుంది ?
ముందుకు ‘ర‌జాకార్’ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘ర‌జాకార్’ ఈ నేల కథ. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎమోషనల్ అవుతున్నారు. సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకుల కళ్ళలో దేశభక్తి కనిపించింది. వందేమాతరం, భారత్ మాతాకీ జై అనే నినాదాలు థియేటర్స్ లో మార్మ్రోగడం చూసినప్పుడు ఇలాంటి సినిమాలో భాగం కావడం ఆనందంగా అనిపించింది. ఇంతమంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు యాట సత్యనారాయణ గారిని నిర్మాత గూడూరు నారాయణ రెడ్డిగారికి ధన్యవాదాలు.

ఇందులో చాలా మంది ప్రముఖ నటులతో నటించడం ఎలా అనిపించింది ?
‘ర‌జాకార్ ‘లో నటించడం చాలా గొప్ప అనుభవం. చాలా మంది ప్రముఖ నటులతో కలసిపని చేసే అవకాశం వుంది. బాబీ సింహ, రాజ్ అర్జున్ తో పాటు మకరంద్ దేశ్ పాండే లాంటి అద్భుతమైన యాక్టర్ తో స్క్రీన్ పంచుడవడం గొప్ప అనుభూతి. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్ ?
రణబీర్ కపూర్, రామ్ చరణ్ ల నటన అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ గారిలో ఇంటెన్స్ ఎమోషన్ ని చాలా ఇష్టపడతాను. హీరోయిన్స్ లో ప్రియాంక చోప్రా, అనుష్క శెట్టి, కీర్తి సురేష్ ఇష్టం. మహానటిలో కీర్తి గారి నటన అద్భుతం. భవిష్యత్ లో అలాంటి మంచి పాత్రలో కనిపించాలని కోరుకుంటాను. 

మీ కుటుంబం నేపధ్యం ఏమిటి ? నటనపై ఆసక్తి ఎప్పుడు ఏర్పడింది ?
 నాన్న సిఏ. అమ్మ గృహిణి. నేను మోడలింగ్ నుంచి కెరీర్ మొదలుపెట్టాను. 2018లో చత్తీస్ ఘడ్ నుంచి మిస్ ఇండియా పోటిల్లో కూడా పాల్గొన్నాను. మా అమ్మ ఒకప్పుడు మోడలింగ్ కూడా చేసేవారు. అమ్మ నుంచి మోడలింగ్ పై ఆసక్తి ఏర్పడింది. అలాగే ముందుగా చెప్పినట్లు కాలేజ్ రోజుల నుంచే నటనపై ఆసక్తి వుండేది. నటనని చాలా ఆస్వాదిస్తాను.

భవిష్యత్ లో ఎలాంటి పాత్రలు చేయాలని వుంది ?
మంచి కథలో ఎలాంటి పాత్ర చేయడానికైన సిద్ధంగా వుంటాను. పాత్రలతో పాటు మంచి కథ, దర్శకుడు, టీం ముఖ్యం.