సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మరాఠి నటుడు రవి పట్వర్థన్ గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. తాజాగా చనిపోయారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆయనను ఇటీవల కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్సపొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
250కి పైగా సినిమాల్లో నటించిన పట్వర్థన్.. హిందీ, మరాఠీ భాషల్లో టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. పట్వర్థన్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 80, 90ల్లో వచ్చిన ‘తేజాబ్’, ‘ప్రతిఘట్’, ‘అంకుశ్’ వంటి ఎన్నో సినిమాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, జడ్జిగా, గ్రామ పెద్దగా గొప్ప పాత్రలు పోషించారు.
ఆయన మృతికి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సంతాపం ప్రకటించారు. ‘తన అద్భుతమైన నటనతో ప్రతి పాత్రను ఒక జ్ఞాపకంగా మలిచిన నటుడిని మనం కోల్పోయాం. ప్రస్తుతం సినిమా, టీవీ పరిశ్రమల్లో నటులుగా రాణిస్తున్న ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఎన్నో మరపురాని పాత్రలను ఆయన మనకు అందించారు. నాటక, సినీ పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటు’ అని ఉద్ధవ్ థాకరే ట్వీట్ చేశారు.