ఒకప్పుడు తెలుగు సినిమాని దశాబ్దం పాటు ఏలిన సినిమాలు ఉద్యమంపై తీసినవే. అప్పటి టాప్ డైరెక్టర్ దాసరి నారాయణ, ఈతరం ఫిలిమ్స్ బ్యానర్ పై గోపీచంద్ వాళ్ల నాన్న టి కృష్ణ, ఆర్ నారాయణమూర్తి… ఈ పంథాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు. కాలక్రమేణా ఉద్యమం బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమాలు తక్కువ అయ్యాయి, అడపాదడపా ఆ జానర్ లోని సినిమాలు వస్తూనే ఉన్నా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. చాలా కాలం తర్వాత ఇప్పుడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వేణు అడుగుల మళ్లీ సినిమాని ఉద్యమం బాట నడిపిస్తున్నాడు. రానా హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి విరాటపర్వం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. విరాటపర్వంలో జానపద గాయనిగా కనిపించనున్న సాయి పల్లవికి సంబందించిన సీన్స్ ఇప్పటికే కంప్లీట్ చేసిన వేణు అడుగుల, రానా కోసం ఎదురు చూస్తున్నాడు. తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీలో నక్సలైట్ గా కనిపించనున్న రానా, ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. రెండు వారాలు తరువాత రానా రాగానే విరాటపర్వం షూటింగ్ మొదలు కానుంది. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. తెలుగు సహా హిందీ, తమిళ భాషల్లో విడుదల కానున్న విరాటపర్వంలో టబు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.