ఆస్పత్రిలో ఉన్న అభిమానికి రజినీకాంత్ ఫోన్ కాల్

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తలైవా పేరుకు తగ్గట్లుగానే తన వ్యక్తిగత విలువను కూడా ఎంతగానో పెంచుకున్నాడు. ఆయన తన అభిమానులతో చాలా సన్నిహితంగా ఉంటాడని అందరికి తెలిసిన విషయమే. ఇక ఎల్లప్పుడూ వారి రక్షణ కోసమే ఆలోచిస్తాడు. అందుకే తలైవా అంటే అంతగా ఇష్టపడతారు.

మదురై జిల్లాలో నలభై ఐదు సంవత్సరాల క్రితం రజినీకాంత్ కోసం ఫ్యాన్ క్లబ్ ప్రారంభించిన మొదటి వ్యక్తి
ఎ.పి.ముత్తుమణి. అతను రజినీకాంత్ కి మొదటి వీరాభిమని అని అప్పట్లో అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ముత్తుమణి తీవ్రమైన ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయం తెలుసుకున్న రజినీ అతనికి కాల్ చేసి అండగా ఉంటానని చెప్పడంతో ఎంతో ఆనందానికి లోనయ్యారు. మదురైలో చికిత్స పొందినప్పటి నుండి గత ఇరవై రోజులుగా తాను నిరాశకు గురయ్యానని, తరువాత చెన్నైకి మారినట్లు ముత్తుమణి తెలిపారు. తన తల్లి, తండ్రి మరియు దేవుడిగా భావించే రజినీ గొంతు విన్నప్పుడు వెంటనే ప్రాణం లేచి వచ్చిందని చెప్పాడు. రజినీకాంత్, ముత్తుమణి భార్యతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు.