రజనీకాంత్ సంచలన ప్రకటన.. తమిళ రాజకీయాల్లో కలకలం

సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు రజనీకాంత్ ఒక ట్వీట్ చేశారు. డిసెంబర్ 31న ప్రకటన చేస్తానని, జనవరిలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని రజనీకాంత్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సోమవారం ‘రజనీ మక్కల్ మండ్రం’ జిల్లా నాయకులతో సమావేశమైన రజనీకాంత్.. రాజకీయాలపై చర్చించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు రాజకీయాల్లో వస్తే ఎలా ఉంటుందనే దానిపై వారితో చర్చించారు.

rajanikanth

ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రజనీకాంత్.. రెండు రోజుల్లో రాజకీయ అరగ్రేటంపై నిర్ణయం తీసుకుంటానని, అభిమానులు వేచి చూడాలని చెప్పాడు. పెడితే కొత్త పార్టీ పెట్టాలని, బీజేపీకి మద్దతిస్తే తాము ఊరుకోమని రజనీకాంత్‌కు అభిమానులు చెప్పారు. ఈ క్రమంలో ఇవాళ తన రాజకీయ ఎంట్రీపై రజనీకాంత్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు జరగనున్న క్రమంలో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అక్కడి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన రాజకీయాల్లోకి రావాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుతున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని 2017 డిసెంబర్‌లో రజనీకాంత్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు.