TFPC ప్రకటనపై స్పందించిన ఛార్మి

నెగిటివ్ రివ్యూలు రాయడం వల్ల నిర్మాతలకు చాలా నష్టం జరుగుతుందంటూ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పూరీ జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నెగిటివ్ రివ్యూలు రాసి నిర్మాతలకు చెడు చేయవద్దని, రేటింగ్ విషయంలో ఒక పాయింట్‌కు బదులు రెండు, రెండుకు బదులుగా మూడు రేటింగ్ ఇచ్చి నిర్మాతలకు అండగా ఉండాలని రివ్యూలు రాసే సినీ విశ్లేషకులను పూరీ కోరాడు. ప్రతి ఏడాది 200 సినిమాలు నిర్మిస్తే.. 190 సినిమాలు ప్లాప్‌గా మారుతున్నాయని, కొందరు సినీ విశ్లేషకుల అవగాహనా రాహిత్యంతో రాసే రివ్యూలు సినిమాలకు శాపంగా మారుతున్నాయని పూరీ అభిప్రాయపడ్డాడు. ఆర్టిస్ట్స్, డైరెక్టర్ ,టెక్నీషియన్స్‌ రెమ్యూనరేషన్, టాక్స్ చెల్లించడం కోసం నిర్మాతల భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తాడని, కొందరు జర్నలిస్టులు రాసే నెగిటివ్ రివ్యూల వల్ల నిర్మాతలు నష్టపోతున్నారని పూరీ తెలిపాడు.

TFPC PRESS NOTE

ఈ క్రమంలో పూరీ చేసిన వ్యాఖ్యలపై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పందించింది. పూరీకి థ్యాంక్స్ చెబుతూ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. పూరీ చేసిన వ్యాఖ్యలను తాము కూడా సమర్థిస్తున్నామని, సినీ జర్నలిస్టులు, వెబ్‌సైట్స్, ఛానెల్స్ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని నిర్మాతలకు పూర్తి సహకారం అందించాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తన ప్రకటనలో సూచించింది.

అయితే తాజాగా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటనపై హీరోయిన్, నిర్మాత ఛార్మి స్పందించింది. ‘మనందరం ఒక ఫ్యామిలీ అని మనం ఎప్పుడూ నమ్ముతున్నాం. ఒకరికొకరం సపోర్ట్ చేసుకుందాం. అందరికీ ధన్యవాదాలు’ అని ఛార్మి ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటనను తన ట్వీట్‌కు జత చేసింది.