కష్టం తెలిసిన వాడు… కష్టంలో ఉన్న వాళ్ల కోసం వచ్చాడు

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఇండస్ట్రీలో ఒకప్పుడు సినిమాలకు దర్శకత్వం వహించి ప్రస్తుతం అవకాశాల్లేక ఖాళీగా ఉన్న ఓ 20 మంది డైరెక్టర్లు, కోడైరెక్టర్లకు ఆర్థికసాయం చేయాలని పూరీ, చార్మి నిర్ణయించుకున్నారు. ఇదేమీ పెద్ద సహాయం కాదని, నిరుత్సాహంలో ఉన్న వాళ్లకు చిన్న చిరునవ్వులాంటి పలకరింపు అని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో లేఖ విడుదల చేశారు. ఒకప్పుడు సినిమా కోసం తమ జీవితాన్ని అంకింతం చేసి, నేడు పని లేక కష్టాలు పడుతున్న కొందర్ని చూసి ఎంతో బాధ కలిగిందని, అయితే వారికి మంచి జరగాలని దేవుడ్ని ప్రార్థించడం కన్నా, తోచినంత సాయం చేయడం మంచిదన్న ఉద్దేశంతో ఈ పని మొదలు పెడుతున్నానని పూరీ, చార్మి తెలిపారు. దేవుడు కరుణిస్తే ప్రతి ఏడాది ఇలాగే సాయం చేస్తామని, తమ ఈ చిన్న సాయం కష్టాల్లో ఉన్నవాళ్లకు ఏ కాస్త ఊరటనిచ్చినా తమ ప్రయత్నం సఫలమైనట్టేనని వివరించారు.