18 ఏళ్ల క్రితం ఇదే రోజున చరిత్ర పుట్టింది

18 ఏళ్ల క్రితం ఇదే రోజున తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు ఒక సినిమా వచ్చింది. ఒక మాములు స్టూడెంట్, జైళ్లలోకి ఎందుకు వెళ్లాడు? అనే పాయింట్ తో వచ్చిన సినిమా స్టూడెంట్ నంబర్ 1. స్వర్గీయ నందమూరి తారక రాముడు మనవడు మొదటి సినిమాతోనే తెలుగు సినీ అభిమానులకి తాతని గుర్తు చేశాడు. ఇక రెండో సినిమా స్టూడెంట్ నో 1తో సూపర్ హిట్ అందుకోని నందమూరి వంశ వారసత్వాన్ని మాత్రమే కాదు పెద్దాయన నట వారసత్వం కూడా తనలో ఉందని ప్రూవ్ చేశాడు. సరిగ్గా మూతిమీద మీసాలు కూడా లేని కుర్రాడు, ఆ తర్వాత బాక్సాఫీస్ ని బాద్షా అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి, 18 ఏళ్ల కాలంలో హిట్ అనే పదానికే కేరాఫ్ అడ్రస్ గా మారి పాన్ ఇండియా వైడ్ మార్కెట్ ని సృష్టించుకున్నాడు. స్టూడెంట్ నెంబర్ వన్ రిలీజ్ అయి నేటికి 18 సంవత్సరాలు గడవడంతో, రాజమౌళి తన సోషల్ మీడియాలో తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. నా తొలి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు18 ఏళ్ళు నిండాయి, కాలం ఎంతో మారింది. ఎన్టీఆర్ ఎన్నో విషయాలని నేర్చుకోని గొప్పస్థాయికి ఎదిగాడు అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు.

ఇదే సమయంలో ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ లో 18 ఏళ్ల కాలంలో ఎంతో మారింది కానీ జక్కనతో వర్క్ చేస్తే వచ్చే ఫన్ మాత్రం మారలేదని ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్, రాజమౌళిలు స్టూడెంట్ నంబర్ వన్ సినిమా నుంచి రెండు ఫోటోలని రేప్లికేట్ చేస్తూ, ఇప్పటి వర్కింగ్ స్టిల్స్ తో కలిపి పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరి ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మూడు హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా కలిశాడు. ఈ ముగ్గరి కలయికలో ఆర్ ఆర్ ఆర్ సినిమా రాబోతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇక్కడి నుంచే ఎన్టీఆర్, రాజమౌళిలు ట్వీట్స్ చేశారు.