డబ్బు లేకపోయినా ‘గామి’ సినిమా తీయడానికి కారణం ఇదే : నిర్మాత కార్తీక్ శబరీష్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ సమర్పణలో మార్చి 8నప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి, విమర్శకుల ప్రశంసలని అందులోని ఘన విజయాన్ని సాధించింది. ‘గామి’ ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్స్ తో అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో నిర్మాత కార్తీక్ శబరీష్ విలేకరుల సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘గామి’ జర్నీ ఎలా మొదలైయింది ?
నేను తమాడ మీడియంలో షో ప్రొడ్యుసర్ గా షార్ట్ ఫిలిమ్స్ కి పని చేసేవాdడిని. అక్కడ చాలా మంది ఎన్ఆర్ఐ లు తమ పేరు చూసుకోవాలనే ఇష్టంతో షార్ట్ ఫిల్మ్స్ ని నిర్మించేవారు. ఇలాంటి వారందరిని ఒక్క చోటికి చేర్చి ఒక సినిమా తీస్తే బావుటుందనే ఆలోచన వచ్చింది. ‘మను’ అలా చేసిన చిత్రమే మను. గామి చిత్రానికి కూడ అదే స్ఫూర్తి. అంతకుముందు దర్శకుడు విద్యాధర్ తో షార్ట్ ఫిలిమ్స్ చేశా. తనతో మంచి అనుబంధం వుండేది. కలసి ‘గామి’ సినిమా చేయాలని నిర్ణయించుకోవడంతో ఈ జర్నీ మొదలైయింది.

‘గామి’ చిత్రానికి వచ్చిన ప్రశంసలు ఎలా అనిపించాయి?
మా లాంటి కొత్త వారికి సినిమా చేసిన తర్వాత అది విడుదల చేయడమే పెద్ద విజయం. లాంటింది ‘గామి’కి అన్ని చోట్లా నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కడం చాలా బలాన్ని ఇచ్చింది. సినిమా విజయం సాధించడంతో ప్రశంసలు దక్కడం మరిన్ని మంచి చిత్రాలు చేయగలమనే నమ్మకాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.

‘గామి’ కథలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏమిటి ?
గామిని ఓ రెండు సినిమాలతో పోల్చడం గమనించాను, నిజానికి ఆ సినిమాలు స్టార్ట్ కాకముందే ‘గామి’ని మొదలుపెట్టాం. క్లైమాక్స్ లో వచ్చే యూనిక్ పాయింట్ చాలా బావుంది. దర్శకుడు చెప్పినప్పుడే చాలా కొత్తగా అనిపించింది. అది నచ్చే సినిమా చేయాలని నిర్ణయించాం.

క్రౌడ్ ఫండ్ తో వచ్చిన నిధులతో ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేశారా ?
నిజం చెప్పాలంటే క్రౌడ్ ఫండ్ అనౌన్స్ చేసిన తర్వాత మాకు వచ్చిన ఫండ్ చాలా తక్కువ. ఐతే ప్రాజెక్ట్ కి కావాల్సిన మొత్తం ఫండ్ ఉన్నపుడే మొదలుపెట్టాలని భావిస్తే అది జరగదు. ముందు దూకేయాలనే ఓ ధైర్యంతో నెల్లూరు లో మొదటి షెడ్యుల్ స్టార్ట్ చేశాం. నెల్లూరు మా సొంత వూరు కాబట్టి లోకేషన్స్ పర్మిషన్స్ సులువుగా దక్కాయి. మాకున్న బడ్జెట్ లో ఆ షెడ్యుల్ పూర్తి చేయగలిగాం. తర్వాత ఏమిటనేది సవాల్. ఈ సమయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ గారు మా వీడియో చూసి కాల్ చేశారు. మా ఆఫీస్ కి వచ్చి మా వర్క్ అంతా చూసి సినిమా గురించి బైట్ ఇచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత జనాలు కొందరు పెట్టుబడి పెడతామని వచ్చారు. అసోషియేషన్స్ దొరికాయి. దాని తర్వాత వర్క్ ఇంకాస్త స్మూత్ గా జరిగింది.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి పని చేసిన వీఎఫ్ఎక్స్ టీంతో గామికి వర్క్ చేశారని విన్నాం?
దర్శకుడు  విద్యాధర్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. తనకి  వీఎఫ్ఎక్స్ పై మంచి పట్టు వుంది. గామిలో చాలా వీఎఫ్ఎక్స్ వర్క్ వుంటుంది. దాని వీలైనంత వరకూ మన పరిధిలో ఎలా చేయగలమని అలోచించాం. ప్రత్యేకంగా సింహం సీక్వెన్స్ ని వారితో చేయించుకొని దానికి అదనంగా వాడాల్సిన హంగులని మన టీంతో చేయించుకునేలా ప్లాన్ చేసుకున్నాం. దాని కారణంగా దాదాపు వారి ఇచ్చిన కొటేషన్ కి 40శాతం తగ్గించగలిగాం. సినిమాని ఫలానా సమయానికి విడుదల చేసేయాలనే ఒత్తిడి లేదు కాబట్టి కావాల్సిన సమయాన్ని వెచ్చించి మంచి అవుట్ పుట్ ని తీసుకురాగలిగాం.

వి సెల్యులాయిడ్ వచ్చిన తర్వాత బడ్జెట్ ని ఇంకాస్త ఎక్స్ ప్యాండ్  చేశారా ?
విశ్వక్ మార్కెట్ పెరిగిన దగ్గర నుంచి బడ్జెట్ ఎక్స్ ప్యాండ్ చేయడం మొదలుపెట్టాం. విశ్వక్ సినిమాలు బ్యాట్ టు బ్యాక్ హిట్ అవ్వడంతో నాకు ధైర్యం వచ్చింది. వి సెల్యులాయిడ్ వచ్చిన తర్వాత మేము సేఫ్ అనే ఫీలింగ్ వచ్చింది. రాజీపడకుండా చేయొచ్చనే ధైర్యం వచ్చింది.

కొత్తగా చేస్తున్న చిత్రాలు ?
ప్రస్తుతం చిరంజీవి గారి విశ్వంభర చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నాను. అది పూర్తయిన తర్వాత కొత్త సినిమా గురించి ఆలోచిస్తాను.