నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ బుధవారం ఉదయం గుండెపోటుతో విశాఖలో కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. తరుణ్ కథానాయకుడిగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ‘సఖియా నాతో రా’ చిత్రాన్ని కృష్ణకుమార్ నిర్మించారు. రోజా రమణి, చక్రపాణిలకి బాగా సన్నిహితుడు అయినా కృష్ణకుమార్ అంతకుముందు ‘ఈ పిల్లకి పెళ్ళవుతుందా’, ‘కలికాలం ఆడది’, ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’, ‘ఈ దేశంలో ఒకరోజు’ చిత్రాలు నిర్మించారు. దర్శకుడు మారుతితో కలిసి ‘బెస్ట్ యాక్టర్స్’ చిత్రాన్ని నిర్మించారు.
అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప మూవీలో విలన్ గా నటిస్తున్న మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా నటించిన మలయాళ మూవీ అథిరన్. 2019లో కేరళలో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ ని కృష్ణకుమార్ కొని, ‘అనుకోని అతిథి’గా తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకోని రావడానికి సన్నాహాలు చేశారు. ఈనెల 28న ఆహా ఓటీటీకలో అనుకోని అతిథి స్ట్రీమింగ్ కూడా అవనుంది. ఈ మూవీని చూడకుండానే ఆయన తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు.
కృష్ణకుమార్ భార్య జ్యోతి కొన్నేళ్ళ క్రితం కాలం చేశారు. ‘వంశ వృక్షం’, ‘తూర్పు వెళ్ళే రైలు’, ‘మరో మలుపు’, ‘మల్లె పందిరి’ తదితర చిత్రాలలో ఆమె కథానాయికగా నటించారు. కృష్ణకుమార్, జ్యోతి దంపతులకు ఓ కుమార్తె ఉన్నారు.