‘పెదకాపు-1’ నా కెరీర్ లో గర్వంగా చెప్పుకునే సినిమా: స్టార్ సినిమాటోగ్రఫర్ ఛోటా కె. నాయుడు…

యంగ్ టాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్రానికి డివోపీగా చేసిన స్టార్ సినిమాటోగ్రఫర్ ఛోటా కె. నాయుడు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘పెదకాపు-1‘ కథ విన్నప్పుడు ఫస్ట్ ఏం అనిపించింది ?
శ్రీకాంత్ అడ్డాల తొలి చిత్రం ‘కొత్త బంగారులోకం’ చేసినప్పుడు… మా జర్నీ మొదలైయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తను చేసిన ప్రతి సినిమా కథ నాకు చెప్తారు. కలసి చేద్దామని అనుకుంటాం కానీ..నాకు డేట్స్ కుదరవు.  ‘పెదకాపు-1‘ కి వచ్చేసరికి.. ‘’కొత్తబంగారంలా ఇదొక డిఫరెంట్ ఫిల్మ్ .. ఎలాగైన కలసి చేయాలి. అవసరమైతే  మీ కోసం వెయిట్ చేస్తానని శ్రీకాంత్ అన్నారు. తన సినిమాల్లానే శ్రీకాంత్ చాలా కూల్ గా వుంటారు. నాకొక కె విశ్వనాథ్ గారిలా అనిపిస్తారు. అయితే నారప్పతో ఆయనలో ఒక కొత్త ట్రాన్స్ ఫర్మేషన్ వచ్చింది. ‘పెదకాపు-1‘ కథ చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ట్రైలర్ లో ఏది చూశామో అంత ఇంటెన్స్ గా చెప్పారు. ఇందులో తన నటన కూడా మొదలుపెట్టారు. శ్రీకాంత్ ఇలాంటి ఒక సినిమా డైరెక్టర్ చేసి ఇలాంటి అవుట్ పుట్ ఇవ్వడం ఒక కెమెరామెన్ గా నాకు షాక్ ఇచ్చింది.

ఇలాంటి యాక్షన్ సినిమాలకి డివోపీగా మీరు కూడా కష్టపడాల్సి వస్తుంది కదా ?
కష్టం అనే మాట నేను వాడనండీ. పని చేయడం నాకు చాలా ఇష్టం. నేను చాలా ఇష్టపడి పని చేస్తాను. ఈ కథ కొత్త ప్యాట్రన్, కొత్త కలర్స్, మేకింగ్ ని డిమాండ్ చేసింది. ఇది నాకు సవాల్ గా అనిపించింది.  

వివి వినాయక్ గారు మిమ్మల్ని పీసీ శ్రీరాం గారితో పోల్చారు కదా ?
వినాయక్ ఈ సినిమాలో కొన్ని పోర్షన్స్ చూశారు. అందువలన ఆయనకి అలా అనిపించి ఉంటుంది. ఐతే ఒక్కటి మాత్రం నిజం.. పీసీ శ్రీరామ్ గారితో పోల్చుకునేంటంత గొప్పోడినైతే కాదు. పీసీ శ్రీరామ్ గారు అల్టిమేట్. విఎస్ఆర్ స్వామీ గారు, విన్సెంట్ గారు ..పీసీ శ్రీరామ్… వీళ్ళంతా గొప్పోళ్ళు.

ట్రైలర్ చూసినప్పుడు విజువల్ గా చాలా ఇంపాక్ట్ గా వున్నాయి ? ఇలాంటి బెస్ట్ అవుట్ పుట్ కి కారణం?
ఈ విషయంలో క్రెడిట్ దర్శకుడిదే. దర్శకుడి హెల్ప్ తోనే ఇలాంటి అవుట్ పుట్ వస్తుంది. కొత్త బంగారు లోకం విజువల్ కి కూడా ఇలానే మాట్లాడారు. చాలా బాగా తీశారని మెచ్చుకున్నారు. తర్వాత నేను చేసిన సినిమాకి అలా మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు శ్రీకాంత్ తో చేసిన గురించి ఇలా మాట్లాడుతున్నారు. ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. నా గొప్పదనం కంటే డైరెక్టర్ విజన్ ముఖ్యం.

మీరు చాలా పెద్ద స్టార్స్ తో సినిమాలు చేశారు.. కొత్త హీరో విరాట్ తో చేయడం ఎలా అనిపించింది ?
హీరో స్థానానికి ఎప్పుడూ గౌరవిస్తాను. నాకు కథానాయకుడు ముఖ్యం. చిన్నా పెద్ద అని కాదు.. ఒక కథలో నాయకుడు గానే చూస్తాను. ఆ కథానాయకుడు ఎలా ఉండాలో కెమరామెన్ గా నాకొక విజన్ వుంటుంది. విరాట్ తో పని చేస్తున్నప్పుడు తను కొత్తవాడు అనే ఫీలింగ్ రాలేదు. అనుభవం వున్న నటుడిలానే చాలా అద్భుతంగా చేశాడు.

ఈ చిత్రంలో అనసూయ గారి పాత్రని ఎంపిక చేయడానికి మీరే సజస్ట్ చేశారా ?
ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వుంది. ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలని చాలా ఆలోచనలు జరిగాయి. ఈ పాత్రలో అనసూయ ఐతే బాగుంటుందని అనుకున్నాం. చాలా మంచి పాత్ర. మేము అనుకున్నదాని కంటే అద్భుతంగా చేసింది తను. ఈ పాత్రే కాదు.. దర్శకుడు శ్రీకాంత్ ఇందులో ప్రతి పాత్రని చాలా చక్కగా డిజైన్ చేశాడు.

శ్రీకాంత్ అడ్డాల గారిని ఒక నటుడిగా చూడటం ఎలా అనిపించింది ?
నిజంగా శ్రీకాంత్ నటుడిగా ఆశ్చర్యపరిచాడు. ఎంత కష్టమైన షాట్ ని కూడా సింగల్ టేక్ లో చేసేశాడు. ఇందులో శ్రీకాంత్ చేసిన ప్రతి సీన్.. సింగిల్ టేక్ లో ఓకే అయిపోయేది. శ్రీకాంత్ చేసిన ప్రతి సీన్ కి మా నిర్మాత రవీందర్ రెడ్డి గారు డైరెక్ట్ చేశారు. షాట్ అవ్వగానే ఓకే అనేవారు( నవ్వుతూ). చాలా సరదాగా చేశాం.

ద్వారక క్రియేషన్స్ లో అఖండ సినిమా పెద్ద హిట్ అయ్యింది.. ఇప్పుడు పెదకాపు ఎంతవరకూ రీచ్ అవుతుంది ?
ఈ సినిమా మామూలుగా మరో నిర్మాత అయితే ఐదు ఆరు కోట్లలో తీయమని అడుగుతారు. కానీ ఈ కథ ముఫ్ఫై నలభై కోట్లు డిమాండ్ చేస్తుంది. రవీందర్ రెడ్డి గారు కాబట్టి ఇంత భారీ బడ్జెట్ తో చిత్రీకరించారు. నాకంటే, శ్రీకాంత్ కంటే నిర్మాత ఈ కథని బలంగా నమ్మారంటే అర్ధం చేసుకోవచ్చు.. పెదకాపు ఎంత మంచి, గొప్ప సినిమానో. ఇదే కాదు.. పెదకాపు 2 కూడా వుందంటే అర్ధం చేసుకోవచ్చు.

పెదకాపు కథ 1983లో  ఎన్టీఆర్ గారి రాజకీయ ప్రవేశం సమయంలో జరిగిందా ?
రామారావు గారు పార్టీ పెట్టినపుడు మొదలైన ఇన్సిడెంట్ ఈ కథగా తీసుకున్నాడు శ్రీకాంత్. శ్రీకాంత్ నాన్నగారు, రామారావు గారికి పెద్ద అభిమాని. రామారావు గారు పార్టీ పెట్టిన రోజుల్లో శ్రీకాంత్ నాన్నగారి ఎఫర్ట్, ఆయన ప్రవర్తన, ఆయనకి చుట్టుపక్కల నుంచి ఎదురైన సంఘటనలపై శ్రీకాంత్ కి మంచి పట్టుఉంది. వాటి స్ఫూర్తితో ఈ కథని రాసుకున్నారు శ్రీకాంత్.  

ఈ సినిమా షూటింగ్ చేస్తున్నపుడు మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన అంశాలు ఏమిటి ?
చాలా వున్నాయి. మీరు ట్రైలర్ లో చూస్తే ఒక అమ్మాయి ఎండిపోయిన చెట్టుకి హ్యాంగ్ చేయబడి కనిపిస్తుంది. సినిమాలో ఆ సన్నివేశం చాలా కీలకంగా వుంటుంది. రెండు ఎకరాల పొలం అది. మొత్తం బురదతో వుంది. అక్కడ ఒక ఎండిపోయిన చెట్టు పెట్టడం పెద్ద టాస్క్. ఆ బురదలో క్రేన్ లు పని చేయవు. ఒక చెట్టుని మనుషులు మోయడం ఇంపాజిబుల్. మరి ఎలా పెట్టామనేది మీరు సినిమా చూసిన తర్వాత చెప్తా. అది ఇప్పుడు చెప్పేస్తే కిక్ వుండదు. నిజంగా చాలా పెద్ద టాస్క్ అది. ఆ సన్నివేశంలో దాదాపు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్ట్ లు వుంటారు. ఒక రోజు మొత్తం ఆ అమ్మాయి( బ్రిగడ) హ్యాంగింగ్ పొజిషన్ లోనే వుంది.  ప్రొడక్షన్ వారి వలనే ఇది సాధ్యపడింది.
అలాగే మునకల లంక అనే ఊరు వుంది. అక్కడ ఓ ఇల్లు ఎంపిక చేసి షూట్ చేశాం. వర్షం వస్తే అది మునిగిపోతుంది. మేము షూట్ చేస్తున్న సమయంలో వర్షం వచ్చి ఆ ఇల్లు మునిగిపోయింది. దీని కోసం మళ్ళీ మూడు నెలలు ఆగి నీళ్ళు పోయిన తర్వాత ఆక్కడ షూట్ చేశాం.

నేను కెమరామెన్ ఐతే గోదారిని ఇలా వాడుకోవాలని వుండేది. కొత్తబంగారు లోకంలో గోదారిని ఒక్క స్థాయి వరకే వాడాను. ఈ సినిమాలో పూర్తిగా వాడే ఛాన్స్ దొరికింది. గోదారి ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వారికి కూడా తెలియని గోదారిని ఇందులో చూపించాను. నిజంగా చాలా కొత్తగా ఫీలౌతారు. ఎవరూ తిరగని ప్రాంతాలని చూపించాం. హీరో ఇల్లు గోదారి గట్టున వుటుంది. మేము వుండే హోటల్ నుంచి రెండున్నగంటల ప్రయాణం చేసి అక్కడికి వెళ్లాలి. అయినప్పటికీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నించాం.
ఈ సినిమాలో మరో పెద్ద ఎలిమెంట్.. వూర్లో జెండాకర్ర పాతడానికి హీరో అండ్ బ్యాచ్ పడే స్ట్రగుల్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. దీని కోసం అడవిలో ఓ పెద్ద చెట్టుని నరికి తెచ్చి పాతుతారు. ఇది మా అందరికీ పెద్ద టాస్క్. ఈ చెట్టు పాతే ఎపిసోడ్ షూట్ చేయడం నా కెరీర్ లో ఓ అద్భుతం. దీనికి క్రియేటర్ శ్రీకాంత్ ఐతే భుజాన మోసింది ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్. నేను చాలా గర్వంగా చెప్పుకునే ఎపిసోడ్ ఇది. 83నాటి వాతావరణం క్రియేట్ చేయడానికి కూడా చాలా హార్డ్ వర్క్ చేశాం. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.

పెదకాపు 1 మ్యూజిక్ గురించి ?
శ్రీకాంత్ అడ్డాల, మిక్కీ జే మేయర్ మధ్య మంచి రేపో వుంది. మిక్కీని బలంగా నమ్మాడు శ్రీకాంత్. మిక్కీ ఇలాంటి నేపధ్య సంగీతం ఇవ్వడం నాకు సర్ ప్రైజ్ చేసింది. అలాగే హీరోయిన్ ప్రగతి కూడా  టెర్రిఫిక్ గా పెర్ఫార్మ్ చేసింది.  

చిరంజీవి గారి సినిమా ఎప్పటినుంచి వుంటుంది ?
చిరంజీవి గారి సినిమా నవంబర్ నుంచి వుంటుంది.

అల్ ది బెస్ట్
థాంక్స్