విజయవాడ పోరంకిలో యుగపురుషుడు ఎన్టీఆర్ సినీ వజోత్సవ సభ శనివారం జరగగా ఆ సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. ఎన్టీఆర్ పేరు మీద రూపొందిన సినీ ప్రస్థానం అనే పుస్తకాన్ని నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించగా వెంకయ్య నాయుడు తారకరామం అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… “నందమూరి తారక రామారావు గారు సినీ రంగాన్ని, అలాగే రాజకీయ రంగాన్ని ఏలారు. ఆయనకు కచ్చితంగా భారతరత్న వచ్చేవరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఎన్టీఆర్ కు భారతరత్నం రావడం ఒక్క తెలుగు జాతికే కాదు దేశానికి కూడా ఆ గౌరవం దక్కుతుంది. ఒక పార్టీ పెట్టి 9 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చరిత్ర దేశంలో ఎన్టీఆర్ కు తప్ప ఇంకా ఎవరికీ లేదు. ఆయన 1945లో మద్రాసు కు బయలుదేరి ఆ తరువాత వెండి ధరణి ఏలేరు. ఇప్పటి సినీ హీరోలు మూడు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తుంటే ఒక సంవత్సరంలోనే పది సినిమాలు తీసిన రికార్డు ఆయనకు ఉంది. ముఖ్యంగా పౌర్ణానికాలలోని రాముడు, రావణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు వంటి ఎన్నో పాత్రలకు ఆయన ప్రాణం పోశారు. అంతేకాక రాజకీయాల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్. క్యాపిటలిజం, కమ్యూనిజం మధ్య ఆయన హ్యూమనిజం సమాధానం ఇచ్చిన మానవత్వం ఉన్న మనిషిగా మరోసారి మానవత్వం విలువ చెప్పారు. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ కు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు జాతి ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ, అలాగే ఎన్టీఆర్ ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉండిపోతారు” అన్నారు.
వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… “ఎన్టీఆర్ సినిమాలలో డైలాగులు గాని పాటల్లో అర్థం కాని ఒక సందేశం ఉండేలా ఉండేవి. అవి చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సినవి. ఒక నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మొదలై ఆ తర్వాత రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన కారణజన్ముడు. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం వల్ల మనం ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం. ఆయన మేకప్ వేసుకున్న వేసుకోకపోయినా అందగాడే. ఆయనను గ్రామాల్లో ప్రజలు ఇంటి ఓడు అని పిలిచేవారు” అన్నారు.