వాట్సాప్ లో కొత్త ఫీచర్ – అది రావడానికి కారణం ఓ తెలుగు దర్శకుడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు సంబంధాలు నెరుపుకుంటూ… సమాచారం చేరవేసుకునే వాట్సప్ లో “వావ్” అనే సంక్షిప్త సందేశం ప్రతిరోజూ కోట్లాదిమంది ఏదో ఒక సందర్భంలో అందుకుంటూనే ఉంటారు. అలాంటిది… సాక్షాత్తు “వాట్సప్” సంస్థ నుంచే “వావ్’ అనే కితాబు అందుకున్నాడు తెలుగు దర్శకతేజం “చెరుకు క్రాంతి కుమార్”. ఈ యువ ప్రతిభాశాలి చేసిన ఒక అద్భుతమైన సూచనతో “ఈవెంట్” అనే కొత్త ఫీచర్ ను “వాట్సప్” తీసుకొచ్చింది. ఈ సూచన చేసిన చెరుకు క్రాంతి కుమార్ కు వాట్సప్ సంస్థ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, గెట్ టుగెదర్స్ వంటి ఈవెంట్స్ ను పదేపదే గుర్తు చేసే బాధ్యతను ఇకపై వాట్సప్ లో “ఈవెంట్” అనే సరికొత్త ఫీచర్ తీసుకుంటుంది. ఈ ఫీచర్ రూపకర్తగా వాట్సప్ చరిత్రలో చెరుకు క్రాంతి కుమార్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

వాట్సప్ వంటి ఓ దిగ్గజ సంస్థ తన సూచనను స్వీరించడం తనను సంభ్రమాశ్చర్యర్యాలకు లోను చేసిందంటున్నాడు క్రాంతి కుమార్. వాట్సప్ కు గల కోట్లాది వినియోగదారుల్లో ఒకడినైన నేను చేసిన సూచన మేరకు… ఒక కొత్త ఫీచర్ ను ఆ టెక్ జయింట్ తీసుకురావడం… తన వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించాలనే సదరు సంస్థ తపనకు, నిబద్ధతకు నిదర్శనంగా చెప్పవచ్చని క్రాంతి పేర్కొన్నాడు. భవిష్యత్తులోనూ తన బుర్రకు పదును పెట్టి… ఇటువంటి సలహాలు ఇచ్చేందుకు ఈ గుర్తింపు తనకు ఎంతో ప్రేరణ ఇస్తుందని తెలిపాడు.

సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన చెరుకు క్రాంతి కుమార్… సినిమాల పట్ల తనకు గల ప్యాషన్ తో సినీరంగ ప్రవేశం చేసి.. తొలిచిత్రం “త్రివిక్రమన్”తో దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. అతని తదుపరి చిత్రం “పీప్ షో” త్వరలో విడుదల కానుంది. స్వతహాగా టెక్నాలజీ ప్రియుడై ఉండి… టెక్నాలజీపరంగా నిరంతరం తననుతాను మెరుగుపరుచుకునే ఈ యువ మేధావి “ఎ ఐ” పేరుతో ఓ పుస్తకం ప్రచురించనున్నాడు. అలాగే ఓ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రి-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.