మే 28న బాలయ్య బాబు నుంచి స్పెషల్ సర్ప్రైజ్

మే 28… తెలుగు సినీ అభిమాని మర్చిపోలేని రోజు. తెలుగు చిత్ర పరిశ్రమని మూడు దశాబ్దాల పాటు ఏలిన వ్యక్తి పుట్టిన రోజు. తెలుగు నేలపై రామరాజ్యం తెచ్చిన మహామనిషి జన్మించిన రోజు. నిమ్మకూరులో పుట్టిన ఆ మహామనిషి పేరు ఎన్టీఆర్… నందమూరి తారక రామారావు. పరిచయం అక్కర్లేని పేరు, ప్రతి తెలుగు వాడు గర్వంగా చెప్పుకునే పేరు. దాదాపు 300 వందల సినిమాల్లో నటించి, సీఎంగా ఉమ్మడి ఆంధ్రాని పాలించి ప్రజలకి మంచి చేసిన ఎన్టీఆర్, ప్రతి కుటుంబంలోని మనిషి. కుల మత ప్రాంతీయతతో సంబంధం లేకుండా అందరూ అన్నగారు అని ప్రేమగా పిలిచారు అంటే అది ఆయనకే చెల్లింది. అందరి అభిమానాన్ని పొందిన అన్నగారి పుట్టిన రోజైన మే 28న నందమూరి అభిమానులు, తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటారు. తండ్రి అంటే అమితమైన ప్రేమ ఉన్న నట సింహం నందమూరి బాలకృష్ణ కూడా మే 28న అభిమానుల కోసం ఎదో ఒకటి చేస్తూ ఉంటారు. గతేడాది మే 28న బాలకృష్ణ మాటలు తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనాలకి దారి తీసింది. ఈ ఏడాది కూడా మే 28న బాలయ్య నుంచి ఒక ఊహించని గిఫ్ట్ రాబోతుందని తెలుగు చిత్ర పరిశ్రమ సమాచారం. మరి 2020 సీన్ రిపీట్ అయ్యి ఈ ఊహించని గిఫ్ట్ ఎన్ని సంచనాలకు కారణం అవుతుందో 2021 మే 28న చూడాలి.