ప్రముఖ నిర్మాత, వి.ఎమ్.సి. సంస్థల అధినేత వి. దొరస్వామి రాజు(74) సోమవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి విదితమే. వి.ఎమ్.సి ప్రొడక్షన్స్ పతాకంపై సీతారామయ్యగారి మనవరాలు, అన్నమయ్య, సింహాద్రి తదితర గుర్తుండిపోయే చిత్రాలను నిర్మించారు నిర్మాత దొరస్వామి రాజుగారు. వి. దొరస్వామిరాజు పూర్తి పేరు వరదరాజ దొరస్వామి రాజు.. చిత్తూరు జిల్లా వరద రాజుల కండ్రిగకి చెందిన చెంగమ్మ, వెంకటరాజు దంపతులకి 1946లో జన్మించారు. వి,ఎమ్.సి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ సంస్థపై వెయ్యికిపైగా సినిమాల్ని పంపిణీ చేశారాయన.
తొలి చిత్రంగా నాగార్జునతో కిరాయిదాదా నిర్మించగా.. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రల్లో సీతారామయ్యగారి మనవరాలు సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. అలాగే నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అన్నమయ్య చిత్రంను నిర్మించగా.. ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు పలు నంది పురస్కారాల్ని సొంతం చేసుకుంది. ఇక 1994లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన దొరస్వామి రాజుగారు నగరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చలన చిత్ర వాణిజ్య మండలి అద్యక్షుడిగా, తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేసిన ఆయన ఆనారోగ్య సమస్యలతో రెండు రోజుల కిందట హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన సోమవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో దొరస్వామిరాజు గారి పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్దం కోసం ఫిలింఛాంబర్‌లో ఉంచారు. ఈ క్రమంలో దర్శక దిగ్గజ రాజమౌళి గారు, మురళీ మోహన్ గారు, అశ్వినీదత్ గారు పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం 11గంటలకు దొరస్వామిరాజు గారి పార్థివదేహానికి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఇక నిర్మాతగా, పంపిణీదారుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివని పలువురు సినీ ప్రముఖులు కొనియాడారు.