చిరంజీవిని క‌లిసిన చిత్ర‌పురి కాల‌నీ క‌మిటీ స‌భ్యులు!

మెగాస్టార్ చిరంజీవిని చిత్ర‌పురి కాల‌నీ నూత‌న క‌మిటీ స‌భ్యులు క‌లిశారు. ఈ నేప‌థ్యంలో త‌న వంతు స‌హ‌కారం అందిస్తాన‌ని వారికి చిరంజీవి హామీ ఇచ్చారు. వివ‌రాల్లోకి వెళితే.. నాన‌క్‌రాంగూడలోని చిత్ర‌పురి కాల‌నీ క‌మిటీలో ఇటీవ‌లే కొత్త కార్య‌వ‌ర్గం బాధ్య‌తలు చేప‌ట్టింది. ఈ నేప‌థ్యంలో కొత్త‌గా ఎన్నికైన చిత్ర‌పురి క‌మిటీ స‌భ్యులు చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయ‌న ఆశీస్సులు తీసుకున్నారు. వెళ్లిన వారిలో చిత్ర‌పురి కాల‌నీ అధ్య‌క్షుడు అనిల్ వ‌ల్ల‌భ‌నేని, కార్య‌ద‌ర్శి కాదంబ‌రి కిర‌ణ్‌, వినోద్ బాల‌, దీప్తి వాజ్‌పేయి, అనిత నిమ్మ‌గ‌డ్డ‌, లలిత‌, రామ‌కృష్ణ ప్ర‌సాద్‌, ఆళ‌హ‌రి త‌దితరులు ఉన్నారు. వీరిని అభినందించి, చిత్ర‌పురి కాల‌నీ అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు.

chiranjeevi

చిత్ర ప‌రిశ్ర‌మ త‌ర‌పున త‌న మ‌ద్ద‌తు కొత్త క‌మిటీకి ఉంటుంద‌ని, కాల‌నీ స‌మ‌స్య‌లు ఏమైనా ఉంటే తాను ముందుండి ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్తాన‌ని చిరంజీవి వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా చిత్ర‌పురి కాల‌నీలో అన్ని సౌక‌ర్యాల‌తో కూడిన ఆసుప‌త్రి నిర్మాణానికి ప్రాజెక్టు రిపోర్టుతో వ‌స్తే, ఉపాస‌న‌తో మాట్లాడి స‌హ‌కారం అందించే ఏర్పాట్లు చేస్తాన‌ని చిరంజీవి వారికి మాట ఇచ్చారు. త‌ప్ప‌కుండా ఒక‌సారి చిత్ర‌పురి కాల‌నీని సంద‌ర్శించి, అక్క‌డి స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా అడిగి తెలుసుకుంటాన‌ని చిరంజీవి క‌మిటీ స‌భ్యుల‌తో అన్నారు. ఈ విష‌యాల‌పై త‌మ‌కు అండ‌గా ఉండేందుకు ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవికి చిత్ర‌పురి కాల‌నీ క‌మిటీ స‌భ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దీనిపై కాదంబ‌రి కిర‌ణ్ మాట్లాడుతూ.. మా అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి గారిని ఈరోజు క‌ల‌వ‌డం ఎంతో సంతోషం క‌లిగించింద‌న్నారు. చిత్ర‌పురి కాల‌నీ కొత్త క‌మిటీ ఏర్పాటైన త‌ర్వాత త‌ప్ప‌నిస‌రిగా అన్న‌య్య చిరంజీవి గారిని క‌ల‌వాల‌ని, ఆయ‌న ఆశీస్సులు తీసుకువాల‌ని అనుకున్నాం. కాల‌నీలో మంచి ఆస్ప‌త్రి నిర్మాణం జ‌ర‌గాల‌ని మూడు నాలుగేళ్లుగా తిరుగుతున్నాను. అప్పుడు ఎంతో ప్ర‌య‌త్నించి వైద్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి గారిని చిత్ర‌పురికి తీసుకొచ్చామ‌ని, ఇప్పుడు ఇదే విష‌యాన్ని చిరంజీవి గారికి చెబితే.. వెంట‌నే ఆయ‌న ఉపాస‌న గారితో ఆస్ర్ప‌త్రి విష‌యం గురించి మాట్లాడ‌తాను అన్నారు. చిరంజీవికి గారికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నామ‌ని అన్నారు. అలాగే.. చిత్ర‌పురి కాల‌నీ అధ్య‌క్షుడు వ‌ల్ల‌భ‌నేని అనిల్ మాట్లాడుతూ.. చిరంజీవి గారిని క‌లిసి చిత్ర‌పురి కాల‌నీ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించాం. కాల‌నీపై వ‌స్తున్న అభియోగాలు, నిజానిజాలు ఆయ‌న‌కు చెప్పాం. మేము చెప్పిన విష‌యాల‌తో చిరంజీవి గారు సంతృప్తి చెందారు. అలాగే క‌మిటీగా ఎన్నుకుని కాల‌నీ వాసులు ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. త్వ‌ర‌లో జ‌రిగే గృహ‌ప్ర‌వేశాల ప్రారంభానికి తాను అతిథిగా వ‌స్తాన‌ని హామీ ఇచ్చారని అనిల్ పేర్కొన్నారు.