సంక్రాంతి భరిలో మాస్ మహారాజ్ రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ తన కారియర్ లో 75వ చిత్రం గురించి ఉగాది పండుగ సందర్భంగా అనౌన్స్ చేసారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం రాబోతుంది అంటూ ఓ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ప్రతి సినిమాతో తనదైన శైలిలో అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తూ వచ్చే రవితేజ ఈ సారికూడా మంచి మాస్ టచ్ ఇవ్వబోతున్నారు అని మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది. అయితే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రాబోతుంది అని మేకర్స్ తెలిపారు.

ఈ సినిమా పోస్టర్ మీద “రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి”, “హ్యాపీ ఉగాది రా భయ్” అని తెలంగాణ యాసలో రాసి ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి చూస్తే తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు “లక్ష్మణ భేరి” అని తెలిపిన మేకర్స్.. ఈ పాత్ర తీరు ఎలా ఉండబోతుందో కూడా ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. “ఆదాయం: చెప్పను తియ్.. ఖర్చు: లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం: అన్ లిమిటెడ్.. అవమానం: జీరో” అంటూ రవితేజ చెప్తున్నట్లు ఉంది.

భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రతిభావంతులైన స్వరకర్త భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రం “ధూమ్ ధామ్ మాస్” దావత్ అని మేకర్స్ పేర్కొన్నారు.