ఈ నెల 5వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న ‘మంజుమ్మల్ బాయ్స్’

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ గా చెప్పుకునే సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’. ఈ సినిమాను సర్వైవల్ థ్రిల్లర్ గా దర్శకుడు చిదంబరం ఎస్ పొదువల్ రూపొందించారు. పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని నిర్మించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు. వరల్డ్ వైడ్ 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందీ సినిమా. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయగా….ఇక్కడా మంచి వసూళ్లు దక్కించుకుంది.

తాజాగా ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా డిజిటల్ ప్రీమియర్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ సినిమాను మే 5వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘మంజుమ్మల్ బాయ్స్’ అందుబాటులో ఉండనుంది. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్ యువకుల సాహసం ఆధారంగా సినిమా రూపొంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘మంజుమ్మల్ బాయ్స్’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ సంచలనం సృష్టించబోతోంది.