‘మా’అధ్యక్షుడిగా ”మంచు విష్ణు” ప్రమాణ స్వీకారోత్సవం!!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శనివారం (16.10.21) జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డా. మోహన్ బాబు, ఆదిశేషగిరిరావు, కాజా సూర్యనారాయణ, చదలవాడ శ్రీనివాసరావు, నరేష్, సి. కళ్యాణ్, శివక‌ృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకి కంగ్రాట్స్. విష్ణు యువకుడు. ఉత్సాహవంతమైన వాడు. ఆయన గెలుస్తాడు అని పది రోజుల ముందే చెప్పాను. ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావుగారు, ఆ తర్వాత శోభన్ బాబు, కృష్ణంరాజు, తర్వాత పెద్దలు మోహన్ బాబు, ఆ తర్వాత చిరంజీవిగారు, బాలకృష్ణగారు, తర్వాత తరంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎంతోమంది ప్రముఖ నటులు చలనచిత్ర పరిశ్రమకు రావడం జరిగింది. మోహన్ బాబు గారికి కోపం, ఆవేశం ఎక్కువ. అయితే ఆయన కోపం ఆయనకే చేటు చేసిందికానీ, ఎవ్వరికీ చెడు చేయలేదు. తప్పును తప్పుగా చెప్పే వ్యక్తి. ధైర్యంగా తప్పును ప్రశ్నిస్తారు. అది ఆవేశం, కోపం అని వేరే వాళ్లు అనుకుంటారు. మనం చేయలేని పని తను చేసినప్పుడు, సమాజ హితువు కోసం మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత అంశాలు ఉండవు. మోహన్ బాబు గారు తన కొడుకు విష్ణుకు మంచి చదువు, సంస్కారం, క్రమశిక్షణను ఇచ్చారు. పెద్దలను గౌరవిస్తూనే మాట్లాడతారు. మా అసోసియేషన్ చిన్న వ్యవస్థ కాదు. 912 మంది ఫ్యామిలీలు ఉన్నాయంటే అది పెద్ద వ్యవస్థ. అలాంటి ‘మా’ అసోసియేషన్ కోసం ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాము అన్నారు.

పద్మశ్రీ డా. మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘ఇది రాజకీయ వేదిక కాదు. ఇది కళాకారుల వేదిక. రాజకీయాలు ఇక్కడ ఉండకూడదు. కొందరు రాజకీయాల్లో ఉండొచ్చు.. కానీ ‘మా’లో మాత్రం రాజకీయాలు ఉండొద్దు. కళాకారులంతా ఒకే తల్లి బిడ్డలు. నేను ముందు నుంచి కూడా ఇదే చెబుతున్నాను. అందరం ఒకే బిడ్డలం. సీనియర్లను గౌరవించుకోవడం కూడా ఇప్పుడు మరిచిపోతున్నాం. ఎంతో మంది గొప్ప వాళ్లంతా కలిసి ‘మా’ ను నడిపించారు. సినిమాలున్నాయా? లేదా? అని ముఖ్యం కాదు. సినిమాలు హిట్ అవుతాయి.. ఫ్లాప్ అవుతాయి. అది కాదు ముఖ్యం. ఎంత కష్టపడినా ఒక్కోసారి సక్సెస్ అనేది ఉండదు. మేం ఇంత మంది ఉన్నాం.. అంత మంది ఉన్నామని బెదిరించారు. కానీ మా సభ్యులు ఎవ్వరూ కూడా ఇక్కడ భయపడలేదు. ఒకరి దయాదక్షిణ్యాలతో అవకాశాలు రావు. టాలెంట్, క్రమశిక్షణ ఉంటే చాన్సులు వస్తాయి. మా ఓటు మా సొంతమని నా బిడ్డను గెలిపించారు. ఏమిచ్చి మీ రుణం తీసుకోవాలి. పానెల్ సభ్యులు భార్యబిడ్డలను వదిలి ఎన్నికల్లో పని చేశారు. నాకు రాగద్వేషాలు ఉండవు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడిని. ఇంత మంది మంచి మనుషులు నా బిడ్డను ఆశీర్వదించారు. మీరే మా దేవుళ్లు. ఓటు వేయని వాళ్ల మీద పగను పెంచుకోవద్దు. అవతలి వాళ్లకు కూడా నేను అవకాశాలు ఇస్తాను. భారతదేశం గర్వించదగ్గ ఖ్యాతిని ‘మా’కు తీసుకురావాలి. సభ్యత, సంస్కారంగా కేసీఆర్‌ను కలవాలి. ఈ ప్రమాణ స్వీకారం తరువాత కేసీఆర్‌ను కలుస్తాం. హీరోలు ఎన్నికలకు రాకపోయినా, ఓటింగ్ వేయకపోయినా ఈ అసోసియేషన్ అందరిది. మీ సహకారం కావాలి. కలిసి మెలిసి పని చేసుకుందాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేర్చుకుంటుంది. ఇది చిన్న ఉద్యోగమని కొందరు అంటారు. మీకు తెలియదా? ఇది చాలా పెద్ద బాధ్యత. అందరూ కలిసి మెలిసి పని చేసుకోండి. సభ్యుల్లో ఎవరికైనా సమస్యలు ఉంటే ప్రెసిడెంట్‌కు చెప్పండి. అంతేకానీ టీవీల్లోకి ఎక్కకండి. విష్ణు చేతిలో ఇప్పటికే మూడు సినిమాలున్నాయి.. విద్యానికేతన్ కూడా ఉంది. పైగా ‘మా’ బాధ్యత కూడా ఉంది. ఇవన్నీ ఎలా చేస్తాడా? అని భయంగా ఉంది. చిత్రపురి కాలనీని హెరిటేజ్‌గా మార్చేద్దామని సీఎం అనుకుంటే.. దాన్ని అడ్డుకున్నాను. అది మా కళాకారుల కోసమే ఉండాలని నేను ముందుపడ్డాను. ఎవరు గుర్తు పెట్టుకున్నా లేకున్నా ఆ ప్రకృతికి తెలుసు. అందరం కలిసి మెలిసి ఉందాం. కలిసికట్టుగా పని చేసుకుందాం. నా బిడ్డ విజయానికి ఎంతో ముఖ్యమైన వాడు నరేష్. రెండు నెలలు తన సినిమాలు పక్కన పెట్టి మరీ విజయం కోసం పని చేశాడు. ఆయన నా మిత్రుడు కూడా కాదు. కానీ అన్నా నేనున్నాను అని వచ్చాడు. కృష్ణమోహన్ పక్షపాతం చూపించకుండా ఎన్నికలను నిర్వహించాడు. ఇక పైన అయినా టీవీలకు వెళ్లకండి. ఎక్కువగా రెచ్చగొట్టకండి. మనం అంతా కూడా ఒక్కటే. అందరూ బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు.

రేష్ మాట్లాడుతూ.. ‘మంచు’ కమిటీ.. మంచి కమిటీ. అనుభవం కలవారు ఉన్నారు. యువత, మహిళలకు పెద్ద పీట వేశారు. మంచి కమిటీ. మంచి మేనిఫేస్టో. అదే మన పనికి అద్దం పడుతుంది. పుట్టిన దగ్గరి నుంచి చనిపోయే వరకు మీతోనే ఉంటుందని చెప్పే మేనిఫేస్టో. మా మెరుగుపెడాలని ఆరేళ్లగా కష్టపడుతున్నాం. మా సంక్షేమం కోసం ఎంతో పాటు పడ్డాం. కరోనాను కూడా ఎదుర్కొన్నాం. మా ఏ ఒక్కరి సొత్తు కాదు. అందరిది. మా అనేది ఓ దిగ్గజం. మా అనేది కోహినూర్ వజ్రంలాంటిది. మేం అంతా అందులో భాగం. కచ్చితంగా ఈ కమిటీ అద్భుతాలను సాధిస్తుందని నమ్మకం ఉంది. మా మెరుగుపడింది. ఈ కమిటీ ముందుకు తీసుకెళ్తుంది. ఈ క్షణం నుంచి మంచి మాత్రమే మైకులో మాట్లాడతాం. చెడు అంటే చెవిలో చెబుదాం. మా పదవి అనేది భుజకీర్తులు కావు.. బాధ్యత. పూర్వాధ్యక్షుడిగా, మెంబర్‌గా ‘మా’ను కచ్చితంగా అంటిపెట్టుకుని ఉంటాను. అందరి మన్నలను పొంది మంచు విష్ణు 106 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. దీన్ని గౌరవిద్దాం. అందరూ సమానమే. కానీ ప్రెసిడెంట్ అనేవారికి ఎక్కువగా గౌరవం ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇందులో రాజకీయం లేదు. మెరుగుపడిన ‘మా’ను ముందుకు తీసుకెళ్లేందుకు చేసిన పోరాటం. ప్రతీ క్షణం అధ్యక్షుడు మనతో ఉండలేరు. కానీ జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ ఇలా ఎంతో మంది ఉంటారు. ఎటువంటి సమస్యలున్నా హెల్ప్ లైన్ ఉంది వాడండి. కంప్లైంట్స్ బాక్స్ ఉంటుంది. నా ఫోన్ నంబర్ మీ దగ్గరుంది. ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి. ‘మా’కు అన్నలా ఎప్పుడూ ఉంటాను. పదవుల కోసం ఉండను.. బాధ్యత కోసం ఉంటాను. ఆఖరి శ్వాస వరకు ‘మా’ కోసం ఉంటాను’ అని అన్నారు.

సీ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘మా’కు విష్ణును ఎలా ఇచ్చాడో.. నాకు ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చింది మోహన్ బాబు. మంచు విష్ణు.. మోహన్ బాబుకు దొరికిన వరం. మాట చెప్పబోయే ముందే మంచు విష్ణు ఆలోచిస్తాడు. ‘మా’కు మచ్చలేని ప్రెసిడెంట్ రావాలని కోరుకున్నాను. అందుకే మంచు విష్ణు రావాలని కోరుకున్నాను. నేను ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో పొల్గొనలేదు. కానీ మోహన్ బాబు గారితో మాట్లాడాను. నాకు సినిమా జీవితం ఇచ్చిన మోహన్ బాబు కోసం చేశాను. ఎవరు ఎన్ని జిమ్మక్కులు చేసినా అవి టీవీల్లో ఉంటాయ్ కానీ మనస్సులో ఉండవు. మేనిఫెస్టోలో ఉన్నవన్నీ చేస్తాడు. ఇక ఎన్నికలు ఉంటే.. మంచు విష్ణు కావాలని అంటారు. దాసరి గారుంటే బాగుండేది అని అంతా అనుకుంటున్నారు కదా? రేపు మా అధ్యక్షుడిగా వేరే వాళ్లు వస్తే.. విష్ణు ఉంటే బాగుండేది అని అనుకుంటారు. మళ్లీ ఎలక్షన్లు వద్దు అని మీతోనే చెప్పిస్తాడు’ అని అన్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘ఈ గెలుపు మా నాన్న గారిది అని చెప్పాను. నాకు ఈ విజయాన్ని అందించిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. మోహన్ బాబు గారి కొడుకు మంచు విష్ణుగా నేను ఈ రెండేళ్లలో ఏం చేయగలనో చూపిస్తాను. నేను గెలిచిన తరువాత ప్రతీ ఒక్కరూ అభినందించారు. వారందరికీ థ్యాంక్స్. 24 క్రాఫ్ట్స్ సహకారం కావాలి. ‘మా’ను మరింత బలంగా తయారుచేయాలి. ఆట ఆడినప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు. ఓడుతారు. మేం గెలిచాం. అవతలి ప్యానెల్ వాళ్లు దాన్ని గౌరవించాలి. వారి సలహాలను నేను గౌరవిస్తాను. వారిలో కొంత మంది రిజైన్ చేశారు. అది దురదృష్టం. కానీ ఆట ముందుకు వెళ్తుంది. ఈ అసోసియేషన్ ఇంకా బలంగా తయారవుతుంది. ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఇకపై నేను గానీ, మా టీం గానీ మీడియా ముందుకు రాము. అయిపోయిన వాటి గురించి ఇక మేం మాట్లాడం. జరగబోయే పనుల గురించే చెబుతాము’ అని అన్నారు.

మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా గెలవడంపై శుభాకాంక్షలు చెబుతూ మోహన్ లాల్, కృష్ణంరాజు వంటి వారు వీడియో సందేశాలను పంపించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ విష్ణు మంచుకు అభినందనలు తెలియజేసారు.