”ఒక రచయిత పీహెడ్డీ గ్రంథం రాస్తే ఎలా ఉంటుందో… ‘మన సినిమా – ఫస్ట్ రీల్’ పుస్తకం అలా ఉంది. నా దృష్టిలో జయదేవ కాలమిస్ట్, జర్నలిస్ట్ మాత్రం కాదు. అంతకు మించిన వాడు. కచ్చితంగా రచయితకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నవాడు. ఒక విషయాన్ని చాలా ఆథెంటిక్గా చెప్పగలడు. ‘ఫస్ట్ రీల్’లో తెలుగు టాకీ తాలూకా కథ చెప్పాడు. ఇదొక నవల లాంటి పుస్తకం. సినిమా మీద ప్రేమ ఉన్న వ్యక్తి పుస్తకం రాస్తే ఎంత ప్రామాణికంగా ఉంటుందో ప్రూవ్ చేశాడు. జయదేవ సినిమా రచయిత అయ్యేలోపు మరిన్ని పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాను” అని ప్రముఖ దర్శకుడు – రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు.
తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సరైన విడుదల తేదీని తన పరిశోధనలో వెలికి తీసిన ప్రముఖ జర్నలిస్టు – రచయిత, ఉత్తమ ‘సినీ విమర్శకుని’గా నంది పురస్కార గ్రహీత డాక్టర్ రెంటాల జయదేవ పాతికేళ్ల సినీ పరిశోధనకు అక్షర రూపం ‘మన సినిమా… ఫస్ట్ రీల్’. దక్షిణ భారత సినిమా చరిత్రను సమగ్రంగా పాఠకులకు అందిస్తున్న గ్రంథం ఇది. ఎమెస్కో పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ బుక్ ఫెయిర్లోని బోయి విజయ భారతి వేదికపై జరిగింది. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ గారు పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కౌండిన్యకు, మలి ప్రతిని సభాధ్యక్షత వహించిన ‘ఎమెస్కో’ విజయ్ కుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాష – సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, జయదేవకు జర్నలిజంలో పాఠాలు చెప్పిన గురువు ఆచార్య డి. చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ కవి – విమర్శకులు అఫ్సర్, రచయిత్రి కల్పనా రెంటాల, దర్శకులు దశరథ్, సీనియర్ జర్నలిస్ట్ ఇందిరా పరిమి తదితరులు పాల్గొన్నారు. త్రివిక్రమ్ చేతుల మీదుగా ‘మన సినిమా… ఫస్ట్ రీల్’ పుస్తకం అందుకున్నారు.
పుస్తకావిష్కరణ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ…
”నేను సినిమాలకు రాస్తూ, దర్శకుడిని అయ్యే సన్నాహాల్లోఉన్న రోజుల్లో మద్రాసులో రెంటాల జయదేవ పరిచయం అయ్యారు. ఆ టైంలో ఆయన ‘ఇండియా టుడే’ మ్యాగజైన్ లో పని చేసేవారు. అందులో ఆయన రాసే ప్రత్యేక సినిమా వ్యాసాలు, సమీక్షలు, ముఖచిత్ర కథనాలు, కాలమ్స్ చూసి ‘ఇతను ఎవరో బాగా రాస్తున్నారు’ అని ఇష్టం ఉండేది. కలిశాక మా మధ్య స్నేహం మొదలైంది. ఇన్నేళ్లుగా కొనసాగుతూ ఉంది. మా స్నేహానికి అతని సాహిత్యం గానీ, నా సినిమాలు గానీ అడ్డుకాలేదు. జయదేవ రాసిన ‘మన సినిమా… ఫస్ట్ రీల్’లో ఇప్పటికి 200 పేజీలు చదివా. కృష్ణ కౌండిన్య, మామిడాల హరికృష్ణ గారు మొత్తం చదివారని తెలిసి భయపడ్డా. ఇప్పుడు నేను పుస్తకంలో వివరాల జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే… నేను పోటీగా ఉండే ఏరియాలోకి ఎంటర్ అవ్వను. పోటీ లేని ఇంకో ఏరియాలోకి ఎంటర్ అవుతా (నవ్వుతూ…).
సినిమాకు ఫస్ట్ రీల్, ఇంటర్వెల్, క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ అని చెబుతారు. పుస్తకానికి ‘ఫస్ట్ రీల్’ అని పేరు పెట్టారు… సినిమా తాలూకా తొలి రోజుల గురించి మాట్లాడుతున్నారు కనుక. ఈ బుక్ కూడా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందంటే… సినిమా మొదలైన పది నిమిషాలలో ఫస్ట్ రీల్ కథలోకి ఎలా తీసుకు వెళుతుందో… అంత ఇంట్రెస్టింగ్ గా రాశారు. బేసిగ్గా నేను పరిశోధనాత్మక గ్రంథాలు చదివే వ్యక్తిని కాదు. నేను చరిత్రలో వీక్. రాజుల కాలం నాటి శాసనం అని మొదలు పెట్టగానే హిస్టరీ ఎగ్జామ్ గుర్తుకు వచ్చి భయం వేస్తుంది. అందుకే లెక్కలు, సైన్స్ చదువుకున్నా. అలాంటిది మన సినిమా చరిత్రను కళ్ళముందుంచిన ‘ఫస్ట్ రీల్’లో 200 పేజీలను రెండు కాఫీల టైంలో చదివేశానంటే… హ్యాట్సాఫ్ టు జయదేవ.
సినిమాలు అంటే జయదేవ అంత పిచ్చ ఉన్న వ్యక్తిని నేను చూడలేదు. సినిమా మీద ప్రేమ ఉన్న వ్యక్తి పుస్తకం రాస్తే ఎంత ఆథెంటిక్గా ఉంటుందో జయదేవ ప్రూవ్ చేశాడు. జయదేవ కూడా సినిమా రచయిత అయ్యేలోపు ఇంకొన్ని పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాను. ఎక్కువ సమయం పుస్తకాలు రాయడంలో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓక్క మాటలో జయదేవ ‘ఫస్ట్ రీల్’ అని పుస్తకం రాయలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం… ఇలా దక్షిణ భారతీయ భాషల తొలి టాకీల తాలూకా కథ చెప్పాడు జయదేవ. ఇదొక నవల లాంటి పుస్తకం. ఉదయాన్ని చదవడం మొదలు పెడితే రెండు మూడు గంటల్లో మూడొందల పేజీలు చదివిస్తుంది. ఇది 500 పేజీల పుస్తకం అని అనిపించదు.
ఈ పుస్తకం చదువుతుంటే… అప్పటి మూకీల కోసం వేసిన గుడారాలు, కింద మట్టిలో కూర్చుని నేల థియేటర్లలో సినిమాలు చూడటం, దగ్గర నుంచి చూడటానికి ఎక్కువ డబ్బులు కట్టడం, ఆ పక్కన అమ్ముతున్న తంపడ వేరుశనక్కాయలు తాలూకా వాసన, సోడాలు ఫ్రీ అంటే సోడా కొడుతున్న గోళీల సౌండ్ – వీటన్నిటినీ పుస్తకంలోకి తీసుకు వచ్చాడు జయదేవ. అది నాకు బాగా నచ్చింది. సాధారణంగా మనం సినిమా పోస్టర్ కు పెద్దగా విలువ ఇవ్వం. పోస్టర్ అంటే సినిమా పేరు చూడటానికి, అందులో యాక్టింగ్ చేసిన వాళ్ళను చూడటానికి! కానీ, వందేళ్ళ క్రితం నాటి ఆ పోస్టర్ల ఆధారంగా జయదేవ మేజర్ రీసెర్చ్ చేసేశారు. పోస్టర్ ఆధారంగా ఫలానా సినిమా ఆ రోజు, ఆ థియేటర్లలో విడుదలైందని, ఆ ఊరిలో ప్రదర్శించారని చెబుతారు. మనకు బోలెడంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లోనూ అందుబాటులోకి వచ్చింది. అందుకే జయదేవ ఎవరికీ తెలియని ఆ ఇన్ఫర్మేషన్ తో పాటు అంత కంటే ఎక్కువగా ‘ఫస్ట్ రీల్’లో ఆనాటి రోజుల అనుభూతిని చెప్పారు.
సినిమా తీసినప్పుడు పడిన కష్టాలతో పాటు ఒకే సెట్లో రెండు సినిమాలు తీయడం, దానికి ఎటువంటి మార్పులు చేశారు? మూకీల నుంచి టాకీలకు మారిన క్రమంలో ఆర్టిస్టులు పడిన కష్టాలు ఏమిటి? వంటివి అన్నీ పుస్తకంలో ఉన్నాయి. నోస్టాల్జియా మూమెంట్స్ క్యాప్చర్ చేసేలా ఓ పరిశోధనాత్మక గ్రంథం రాయడం చాలా కష్టం. ఆరుద్ర రాసిన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ పుస్తకానికి ఎక్కువ విలువ రావడానికి కారణం ఏమిటంటే… ఒక కవి పండితుడు అయితే ఉండే అడ్వాంటేజ్ ను ఆయన వాడుకున్నాడు. అలాగే, ఒక రచయిత ఒక పీహెడ్డీ గ్రంథం రాస్తే ఎలా ఉంటుందో ‘ఫస్ట్ రీల్’లో అలా ఉందని నాకు అనిపించింది. జయదేవ స్వతహాగా ఒక కాలమిస్ట్ మాత్రం కాదు. అంతకు మించిన వాడు. కచ్చితంగా ఒక రచయితకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నవాడు. అటువంటి వ్యక్తి ఎందుకు ఇన్నేళ్ల పాటు సమగ్రమైన, సంపూర్ణమైన రచన చేయలేదనే ప్రశ్న నా మదిలో ఉంది. జయదేవ తండ్రి రెంటాల గోపాలకృష్ణ గొప్ప కవి. ఆయన 200లకు పైగా పుస్తకాలు రాశారు. జయదేవ అక్క కల్పనా రెంటాల గారు రచయిత్రి. ఆవిడ రాసిన ‘తన్హాయి’ తదితర నవలలు, కథలు చదివాను. జయదేవ ఎందుకు రాయడం లేదు? అనే ప్రశ్న ఉండేది. కానీ, అడగలేదు. ఎందుకంటే… (నవ్వుతూ…) ఎవర్నీ అడగను. నన్ను కూడా ఎదురు అడుగుతారని. రెండేళ్లకు, మూడేళ్లకు ఒక సినిమా రాస్తున్నావని అడుగుతారేమో అని! మనం చెప్పే విషయం కచ్చితంగా బాగా చెప్పి తీరాలని, అందులో తప్పులు ఉండకూడదని జయదేవకు భయం, భక్తి ఎక్కువ. తరచి తరచి చూసుకుంటారు. పరిశోధన చేసే ప్రతివారికీ అది ఉంటుందని అనుకుంటున్నాను. అందుకే బుక్ రాయడానికి ఇన్నేళ్లు సమయం తీసుకున్నాడు జయదేవ. నా దృష్టిలో రచయితకు కొంత అజ్ఞానం అవసరం. అందుకని, కొంత అజ్ఞానంతో జయదేవ ఎక్కువ పుస్తకాలు రాయాలని, నా లైబ్రరీలో ఒక ర్యాకులో వరుస అంతా అతని పుస్తకాలతో నిడిపోవాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
‘ఎమెస్కో’ విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ… ”ఇటువంటి కార్యక్రమం నేను చేయాల్సి వస్తే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని పిలిచేవాడిని. ఆయన నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు. ఇవాళ త్రివిక్రమ్ గారిని చూస్తుంటే మా శాస్త్రి గారి పక్కన కూర్చున్నట్లు ఉంది. భాష పట్ల, సంస్కృతి పట్ల తాను ఉన్న చట్రంలో తనను తాను ఇముడ్చుకుంటూ తన వ్యక్తీకరణలో ఒక స్థాయిని తీసుకొచ్చిన వ్యక్తి త్రివిక్రమ్. ఒక్కమాటలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి తాలూకా గద్య రూపం త్రివిక్రమ్ అని చెప్పవచ్చు. జయదేవను ఈ పుస్తకం రాయమని అడిగా. తక్కువ సమయంలో మంచి బుక్ తీసుకొచ్చారు” అని అన్నారు.
ఐఆర్ఎస్ ఆఫీసర్ కృష్ణ కౌండిన్య గారు మాట్లాడుతూ… ”చరిత్రను తిరగరాసే రీసెర్చ్ జయదేవ గారు చేశారు. ఇప్పటి వరకు తెలుగు టాకీల్లో ఫస్ట్ సినిమా ఏది? అని ప్రశ్నిస్తే ‘భక్త ప్రహ్లాద’ (1932) అని చెప్పుకొంటున్నాం గానీ దాని కంటే ముందు 1931లో ‘కాళిదాస్’ అని ఓ సినిమా తీశారు. దాని కంటే ముందు భారతదేశంలో మొదటి టాకీ ‘ఆలం ఆరా’ వచ్చింది. అదే సంవత్సరం, అదే ‘ఆలం ఆరా’ సెట్లో ఇంకో సినిమా తీశారు హెచ్ఎం రెడ్డి గారు. అది ‘కాళిదాస్’ అని జయదేవ గారి పుస్తకం ‘ఫస్ట్ రీల్’ చదివిన తర్వాత తెలిసింది. ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6) కన్నా ముందే ఆ ‘కాళిదాస్’ (1931 అక్టోబర్ 31) టాకీలో వెండితెరపై తొలిసారిగా మన తెలుగు మాట, పాట వినిపించాయి. కానీ, ఆ సంగతిని తెలుగువాళ్ళం విస్మరిస్తూ వస్తున్నాం. ఫలితంగా, ‘కాళిదాస్’ ను తమిళం వాళ్ళు వాళ్ళ సినిమాగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో ఆలోచింపజేసే, పరిశోధనాత్మక అంశాలు ఈ ‘ఫస్ట్ రీల్’ పుస్తకంలో రెంటాల జయదేవ వెలికితీశారు. ఈ పుస్తకంలో ఇంకో గొప్ప విషయం ఏమిటంటే… కేవలం తెలుగు సినిమా మీద కాకుండా దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్ర పరిశ్రమ ఎలా అభివృద్ధి అయ్యిందనేది స్పష్టంగా రాశారు. జయదేవ గారి పాతికేళ్ల సుదీర్ఘ సాధన, పరిశోధన ఫలితం ఈ పుస్తకం. సినిమాపై ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కొని చదవాల్సింది, పదిలంగా దాచుకోవాల్సింది” అని అన్నారు.
ఎమెస్కో ప్రచురణల సంపాదకులు ఆచార్య డి. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… ”జయదేవ 32 ఏళ్ల క్రితం నా స్టూడెంట్. ఆ క్లాసులో జయదేవ అంత అమాయకులు మరొకరు లేరు. అమాయకత్వం నిలబెట్టుకోవడం చాలా కష్టం. అమాయకత్వం ఉందంటే సిన్సియారిటీ కూడా ఉంటుందని అర్థం. జయదేవ అబద్ధం చెప్పడు. నిజం చెప్పడానికి ఎంత కష్టపడాలో… అంత కష్టపడతాడు. నిజం చెప్పడం అంత తేలిక కాదు. ఈ పుస్తకం గురించి మాట్లాడాలంటే రెండు మూడు రోజులు పడుతుంది. ఒక విషయాన్ని ఎంత లోతుకు వెళ్లి పరిశోధించి ఒక వాస్తవాన్ని, ఒక సత్యాన్ని వెలుగులోకి తీసుకు రావొచ్చో… అది జయదేవ ఈ పుస్తకం ద్వారా నిరూపించాడని నేను అనుకుంటున్నాను. అతను మరిన్ని పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
తెలంగాణ భాష – సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ… ”ప్రతి కళారూపం అత్యంత ప్రాచీనమైనది. అన్నిటి కంటే యంగెస్ట్ కళారూపం సినిమా. 1896లో లూమియర్ బ్రదర్స్ వచ్చేవరకు సినిమా అనేది లేదు. చిత్రాలు ఉన్నాయి కానీ చలనచిత్రాలు లేవు. మన దేశంలో 1920లలో దక్షిణ భారతంలో సినిమా పురుడు పోసుకుంది. ‘మన సినిమా… ఫస్ట్ రీల్’ పుస్తకంలో రెంటాల జయదేవ దక్షిణాది భాషల్లో సినిమా పరిణామ క్రమాన్ని చక్కగా విశ్లేషిస్తూ రాశారు. అప్పటి దర్శకులు, రచయితలు, నిర్మాతలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారనేది కూడా చాలా చక్కగా, అద్భుతంగా, సాధికారికంగా, సోదాహరణంగా రాశారు. ఒక పుస్తకానికి ప్రామాణికత, ఒక పరిశోధనకు సార్వజనీనత ఎప్పుడు వస్తుందంటే… మూడు ‘ఎ’లు ఉన్నప్పుడు వస్తుంది. ‘అథారిటేటివ్, ఆథెంటిక్, ఆక్యురేట్’గా బుక్ ఉండాలి. ఇవన్నీ చెప్పడానికి కావాల్సిన ఎవిడెన్స్ స్పష్టంగా కనిపించగలగాలి. జయదేవ పుస్తకంలో అవన్నీ ఉన్నాయి. తొలినాటి తెలుగు సినిమాను మాత్రమే కాకుండా తొలినాటి కన్నడ సినిమా, తమిళ సినిమా, మలయాళ సినిమాకు సంబంధించిన విశేషాలు అన్నిటినీ క్రోడీకరించిన ఒక అరుదైన, అద్భుతమైన, అపూర్వమైన గ్రంథంగా ‘ఫస్ట్ రీల్’ నిలిచింది” అని అన్నారు.
రచయిత, నంది పురస్కార గ్రహీత, ప్రముఖ జర్నలిస్టు డాక్టర్ రెంటాల జయదేవ మాట్లాడుతూ… ”అమ్మ తర్వాత అమ్మలా నన్ను సాకినటువంటి మా మూడో అక్క కల్పన, మా మూడో అన్నయ్య రెంటాల రామచంద్ర ఈ పుస్తకం రావడంలో నా వెన్ను తట్టి ప్రోత్సహించారు. మూడున్నర దశాబ్దాల పైగా సినిమాల గురించి నేను రాస్తున్నా, ఇదే నా తొలి సినిమా పుస్తకం. సినిమాలపై నేను పుస్తకం రాయకపోతే నాతో మాట్లాడానని మా అక్క నాతో చెప్పింది. మా అక్క చెప్పిన గడువు దాటినా, సంవత్సన్నర ఆలస్యంగా అక్కకు ఇచ్చిన మాట చెల్లించుకున్నాను. నాకు అక్షరం నేర్పిన గురువులు ఎంతో మంది ఉన్నారు. అందులో మా చంద్రశేఖర్ రెడ్డి మాస్టర్ ఇవాళ ఇక్కడ ఉండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆత్మీయులు త్రివిక్రమ్ గారు ఇవాళ ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది” అని అన్నారు.