లాక్డౌన్ తర్వాత 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ పలు రాష్ట్రాలు మాత్రం 100శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం 100శాతం ఆక్యుపెన్సీకి అనుమతినిచ్చినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే ఇక ఇప్పుడు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లకు 100శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చంటూ..
కోల్‌కత్తాలో శుక్రవారం జరిగిన 26వ కోల్కత్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మమతా బెనర్జీ ఈ విషయాన్ని తెలిపారు. కానీ కొవిడ్ ప్రోటోకాల్స్ కట్టుబడి థియేటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అయితే ఇదే విషయంలో తమిళనాడు నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించిన ఒక్కరోజులోనే మమత ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్యనే బెంగాల్ సినీ పరిశ్రమ పెద్దలు మమత బెనర్జీని కలిసి థియేటర్లలో 100శాతం ఆక్యుపెన్సీకి అనుమతించాలని కోరగా.. దీనిపై ఆలోచిస్తానని సమాధానమిచ్చిన దీదీ.. శుక్రవారం ఈ ప్రకటన చేశారు. మరీ దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి