ఎన్‌.టి.ఆర్‌. స్వహస్తంతో రాసిన లేఖ!

“ఎన్‌.టి.రామారావు” చేతివ్రాత ముత్యాలు పేర్చినట్టు వుంటుంది. 1966లో ‘విజయచిత్ర’ ఆయన ముఖచిత్రం ప్రచురించింది. ఆ సందర్భంగా పాఠకులకు లేఖ రాయమని కోరితే ఆయన అంగీకరించారు. ఆయన రాత బాగుంటుంది కాబట్టి, ఆయన చేతనే రాయిస్తే, బాగుంటుందని అభిప్రాయపడి అడిగితే ‘‘తప్పకుండా బ్రదర్‌’’ అన్నారు. ‘‘షూటింగ్‌లో వుంటాను రండి’’ షాటు మధ్యలో విరామం వుంటుంది గదా, రాస్తాను అన్నారు.

నేను ఇండియన్‌ ఇంకు, కలం, రూళ్లు కాగితం అన్నీ తీసుకెళ్లాను. అప్పటికే ఆయన ఆలోచించుకుని రాసుకుని వచ్చారు. నేను వెళ్లగానే చదివి వినిపించారు. ‘‘చాలా బాగుంది’’ అని, ‘‘నల్ల సిరాతో రాస్తే అచ్చులో కాపీ అవుతుంది’’ అని అన్నీ ఇచ్చాను. ఖాళీ దొరికినప్పుడల్లా వాక్యాలు రాస్తూ వచ్చారు. మూడు పేజీలు వచ్చింది. ఎక్కడా అక్షరం తప్పు దొర్లలేదు. కానీ, మూడోపేజీ చివరికొచ్చేసరికి ఒక అక్షరం తప్పయిపోయింది. ‘‘పర్వాలేదు అన్నగారూ, మీరు దానిమీదనే దిద్దేయండి. మా ఆర్టిస్టు తలకట్టు మీద తెలుపుతో టచ్‌ చేస్తాడు. సరిపోతుంది’’ అన్నాను. ఆయన వద్దన్నారు. ‘‘ఏం పోయింది, మళ్లీ రాస్తాను’’ అని, ఓపిగ్గా – ఆ పేజీని మొదట్నించి మళ్లీ రాసి కింద సంతకం చేసారు. అదీ ఎన్టీఆర్‌ శ్రద్ధ, నిబద్ధత.” రావి కొండలరావు