తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్లతో సమానంగా స్టార్డమ్ అందుకుని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు హీరో కృష్ణ. కౌబాయ్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు అని చెప్పవచ్చు. ఎన్నో డిఫరెంట్ సినిమాలను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. పద్మాలయ బ్యానర్‌ను ఏర్పాటు చేసి ఆయనే నిర్మాతగా మారి అనేక హిట్ సినిమాలను నిర్మించారు. ఇప్పటివరకు 350కి పైగా సినిమాల్లో ఆయన నటించగా.. ఆయన కెరీర్లో అల్లూరి సీతారామరాజు అనే సినిమా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
తెలుగులో తెరకెక్కిన తొలి సినిమాస్కోప్ సినిమాగా అల్లూరి సీతారామరాజు రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఆరోగ్యం సహకరించకపోవడంతో నటనకు కృష్ణ దూరమయ్యారు. ఎన్నో సినిమాలతొ తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన కృష్ణకు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణ పేరు మీద పోస్టల్ స్టాంపులు విడుదల చేసింది. 1.65 ఆస్ట్రేలియన్ డాలర్ విలువ చేసే ఈ స్టాంపులను ఆస్ట్రేలియాలో పోస్టేజ్ కోసం ఉపయోగించుకోవచ్చు.
తమ అభిమాన హీరోకు అరుదైన గౌరవం దక్కడంతో కృష్ణ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని కృష్ణ అభిమానులు చొరవతోనే ఇది సాధ్యమైందని తెలుస్తోంది. ఇటీవల అభిమానులు కృష్ణను కలుసుకుని ఈ పోస్టల్ స్టాంపును బహూకరించారు. ఇది చూసి కృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తెలుగు సినిమా పరిశ్రమకు దక్కిన గౌరవంగా కృష్ణ అభివర్ణించారు.