రాక్షసుడు 2లో తమిళ స్టార్ హీరో?

రాక్షసుడు 2’.. తాజాగా ఈ సినిమాను ప్రకటించారు. ‘రాక్షసుడు’కి సీక్వెల్‌గా ‘రాక్షసుడు 2’ రూపొందంచబోతున్నామని దర్శకుడు రమేష్ వర్మ వెల్లడించాడు. ఇంతక ముందు తమిళంలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా ‘రాక్షసన్’. ఇదే సినిమాను తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘రాక్షసుడు’ అనే పేరుతో రీమేక్ చేశారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. కోనేరు సత్యనారాయణ నిర్మించారు. కాగా ఇప్పుడు దర్శకుడు రమేష్ వర్మ సొంత కథను రెడీ చేసుకొని ‘రాక్షసుడు’ సినిమాకి సీక్వెల్ చేయనున్నట్టు తెలిపాడు.

ఈ నేపథ్యంలో ‘రాక్షసుడు 2’ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను విడుదల చేశారు. అంతేకాదు ‘హోల్డ్ యువర్ బ్రీత్’ అంటూ ఈ సీక్వెల్ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు. దాంతో మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ కి హిట్ దక్కబోతోందని అనుకున్నారు. కాని మేకర్స్ మాత్రం ఈ సినిమాలో నటించబోయే హీరోని ప్రకటించలేదు. అయితే ఇందులో ఓ స్టార్ హీరో నటించబోతున్నాడని ప్రచారం మొదలయింది. ఆ స్టార్ హీరో ఆయనే అంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నటించబోయేది టాలీవుడ్ స్టార్ హీరో కాదని సమాచారం.

తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరో ‘రాక్షసుడు 2’లో నటించబోతున్నాడట. ప్రధానంగా ‘రాక్షసుడు 2’ కోసం చిత్ర బృందం విజయ్ సేతుపతి గానీ, శివ కార్తికేయన్ గానీ నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ విజయ్ సేతుపతి ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఎక్కడ అవకాశం వచ్చినా డేట్స్ ఉంటే సినిమా ఒప్పుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ‘రాక్షసుడు 2’ ఆయనని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి దీనికి సంబంధించిన అధికారక ప్రకటన ఎప్పుడు వస్తుందో. ఇక రమేష్ వర్మ ప్రస్తుతం రవితేజతో ఖిలాడి తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత ‘రాక్షసుడు 2’ మొదలవనుందట.