గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు గౌర‌వ‌ డాక్ట‌రేట్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీర్తి కిరీటంలో మ‌రో డైమండ్ చేరింది. చెన్నైకు చెందిన ప్ర‌ముఖ వేల్స్ యూనివ‌ర్సిటీ ఆయ‌న‌కు గౌర‌వ డాక్ట‌రేట్‌ను అందిస్తోంది. దీంతో ఆయ‌న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ వంటి వారి స‌ర‌స‌న చేరారు. సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన మొద‌లు ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్ ఇమేజ్ వ‌చ్చేంత వ‌ర‌కు ఆయ‌న అంకిత భావంతో అసాధార‌ణ ప్ర‌తిభ‌ను చూపించారు. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్‌ న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా సాధించిన విజ‌యంతో రియ‌ల్ గేమ్ ఛేంజ‌ర్‌గా మారి గ్లోబ‌ల్ స్టార్ బిరుదుని సొంతం చేసుకున్నారు.

త‌మ అభిమాన హీరోకు ద‌క్కిన గౌర‌వంపై రామ్‌చ‌ర‌ణ్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. సోష‌ల్ మీడియాలో అయితే ఈ వార్త తెగ వైర‌ల్ అవుతుంది. చ‌ర‌ణ్‌కు గౌర‌వ డాక్ట‌రేట్ రావ‌టంపై ప‌లువురు ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని మెసేజ్‌లు పెడుతున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న చేయ‌బోతున్న సినిమాలు ఆయ‌న కెరీర్‌లో మరింత గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి.

ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోన్న గేమ్ ఛేంజ‌ర్ చిత్రాన్ని ఈ ఏడాదిలో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న RC16 సినిమాలో చ‌ర‌ణ్‌కు జోడీగా జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ చిత్రం ఘ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే రంగ‌స్థ‌లం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్ లో సినిమా రూపొంద‌నుంది. దానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే.

వివిధ రంగాల్లో విశిష్ట వ్య‌క్తుల‌ను గుర్తించి వారికి గౌర‌వ డాక్ట‌రేట్స్ ఇవ్వ‌టంలో వేల్స్ యూనివ‌ర్సిటీ ప్ర‌సిద్ధి చెందింది. ఈ ఏడాదికిగానూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో ఎంట‌ర్‌ప్రెన్యూర‌ర్‌గా రామ్ చరణ్ చేసిన సేవ‌ల‌కు వేల్స్ యూనిర్సిటీ ఆయ‌న‌కు గౌర‌వ డాక్ట‌రేట్‌ను అంద‌చేస్తోంది. ఈ వేడుక ఏప్రిల్ 13న గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. అందులో రామ్ చ‌ర‌ణ్‌తో పాటు డా.పి.వీర‌ముత్తువేల్ (ప్రాజెక్ట్ కో ఆర్డినేట‌ర్ చంద్ర‌యాన్‌, ఇస్రో), డా.జి.ఎస్‌.కెవేలు (ఫౌండ‌ర్‌, సీఎండి ట్రివిట్రోన్ హెల్త్ కేర్‌), అచంట శ‌ర‌త్ క‌మ‌ల్ (ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత‌, ప్ర‌ముఖ టేబుల్ టెన్నిల్ ప్లేయ‌ర్‌)ల‌ను కూడా గౌర‌వించ‌నున్నారు.

రామ్‌చ‌ర‌ణ్ త‌న అంకిత భావం, విన‌యం, న‌ట‌న‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కులు హృద‌యాల‌ను గెలుచుకున్నారు. ఈయ‌న జర్నీ ఎంతో మంది ఔత్సాహిక న‌టీన‌టుల‌కు స్ఫూర్తిదాయ‌కం. ఇప్పుడు ఆయ‌న‌కు గౌర‌వ డాక్ట‌రేట్ రావ‌టం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన‌ట్ట‌య్యింది.