సినిమాకు భాషతో, హద్దులతో సంబంధం లేదు. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది ‘జిగ్రా’ మూవీ. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంపై బాలీవుడ్‌లో మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ అంచనాలు దక్షిణాదికి వ్యాపించనున్నాయి. మంచి సినిమాలకు తన వంతు ఆదరణను ఎప్పుడూ తెలియజేసే హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాను తెలుగులో విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ‘జిగ్రా’ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా రానా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా హిందీ ట్రైలర్ విడుదలై అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే. కాగా జిగ్రా తెలుగు ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా…
ధర్మ ప్రొడక్షన్స్ సి.ఇ.ఒ అపూర్వ మెహతా మాట్లాడుతూ ‘‘ప్రతిష్టాత్మక చిత్రమైన బాహుబలి, ఘాజి ఎటాక్ వంటి సినిమాలతో ధర్మ ప్రొడక్షన్స్‌తో రానా దగ్గుబాటికి మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు ‘జిగ్రా’ తెలుగు విడుదల కోసం రానాతో, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో చేతులు కలపటం గర్వంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు మంచి సినిమాలను అందించాలనే మా అంకితభావం మరోసారి దీంతో స్షష్టమవుతోంది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఆలియా భట్‌తో పాటు వేదాంగ్ రైనా అద్భుతమైన నటన ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుంది. దీనికి భాష, ప్రాంతీయ హద్దులు ఉండబోవు. ఈ జిగ్రా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల చేయటానికి సమాయత్తమవుతున్నాం. తెలుగు సహా దేశం యావత్వు ఉన్న సినీ ప్రేమికులు, ప్రేక్షకులు తమ ప్రేమను, అభిమానాన్ని మా సినిమాపై చూపిస్తారని ఆశిస్తున్నాం. ఇండియన్ సినిమాలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకోవటానికి మరో ముందడుగుగా మేం భావిస్తున్నాం’’ అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘‘జిగ్రా కథలో మంచి సోల్ ఉంది. భాషతో సంబంధం లేకుండా ఎవరికైనా ఇది కనెక్ట్ అవుతుంది. ఇలాంటి వైవిధ్యమైన కథతో రూపొందిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని భావించాం. అందుకనే ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి నేను, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నామని గర్వంగా తెలియజేస్తున్నాం. జిగ్రా అనేది కేవలం యాక్షన్ చిత్రం మాత్రమే కాదు.. మా కుటుంబంలోని అనుబంధాలను తెలియజేసే చిత్రం. మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తులను మనం ఎలా కాపాడుకోవాలో తెలియజెప్పే సినిమా. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం భాష, సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందనటంలో సందేహం లేదు’’ అన్నారు.
ఆలియా భట్‌ను ఇప్పటి వరకు ఎన్నడూ చూడనటువంటి ఓ సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో చూడబోతున్నాం. జిగ్రా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నటిగా ఆలియా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ తిరుగులేని విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1- శివ, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌ను అలరించిన ఈమె ఇప్పుడు జిగ్రాతో మనసులను గెలుచుకోడానికి సిద్ధమవుతోంది. ఆలియా, ధర్మ ప్రొడక్షన్స్ కలయికలో వస్తోన్న ఈ చిత్రం ఓ మైల్‌స్టోన్ మూవీగా నిలవనుంది.
ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో విడుదలైన బాహుబలి ఫ్రాంచైజీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌ను సాధించిన సంగతి తెలిసిందే. అదే జోరుని ఘాజీ ఎటాక్‌తోనూ ఈ సంస్థ కొనసాగించింది. తాజాగా ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర పార్ట్1ను కూడా హిందీలో విడుదల చేసిందీ సంస్థ.
- వయాకామ్ 18 స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్‌నల్ షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సమర్పణలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మాతలుగా రూపొందిన ‘జిగ్రా’ చిత్రం అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలవుతుంది.