45 సంవత్సరాల సినీ మెగా జర్నీని పూర్తి చేసుకున్న ‘మెగాస్టార్‌ చిరంజీవి’కి ‘గ్లోబల్ స్టార్’ అభినందనలు…

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. సామాన్యుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి ఇంతింతై వటుడింతైనట్లు మెగాస్టార్‌గా ఎదిగారు. కొన్ని కోట్ల మందికి స్ఫూర్తినిస్తూ తన అలుపెరుగని ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన చిత్ర సీమలోకి ప్రవేశించి 45 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్, రామ్ చరణ్ అభినందనలు తెలియజేశారు.

‘‘సినీ పరిశ్రమలో 45 సంవత్సరాల మెగా జర్నీని పూర్తి చేసుకున్న మన ప్రియమైన మెగాస్టార్‌కి హృదయపూర్వక అభినందనలు. ఆయన ప్రయాణం ఎంతో గొప్పది. ప్రాణం ఖరీదుతో ప్రారంభమైన ఈ జర్నీలో ఆయన మనల్ని ఇప్పటికీ అబ్బురపరుస్తూనే ఉన్నారు. వెండితెరపై అద్భుతమైన నటనతో, బయట మీ మానవత్వంతో కూడిన మీ కార్యకలాపాలను కొనసాగిస్తూ కొన్ని కోట్ల మందిని ఇన్‌స్పైర్ చేస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కష్టించే తత్వం, అంకిత భావం వంటి విలువలతో పాటు వాటన్నింటినీ మించి మాలో కరుణను పెంపొందించిన నాన్నగారికి ధన్యవాదాలు’’ అని అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.