ఘనంగా ‘ధీర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ – ముఖ్య అతిధులుగా

వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత ‘ధీర’ అనే సినిమాతో లక్ష్ చదలవాడ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో దిల్ రాజు, గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన సినిమా బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఈవెంట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘25 ఏళ్ల నుంచి చదలవాడ బ్రదర్స్‌ని చూస్తూనే ఉన్నాం. అనురాధ ప్రొడక్షన్స్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. ఆ టైంలోనే నేను డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించాను. వారితో నాకు పెద్దగా పరిచయం ఉండేది కాదు. దసరా సినిమాను వాళ్లు కొన్నారని తెలిసి వారిని కలవడం జరిగింది. ఆ తరువాత మేం వ్యక్తిగతంగా ఎంతో దగ్గరయ్యాం. శ్రీనివాస్ గారు ఎంతో మంది చిన్న నిర్మాతలకు సాయం చేశారు. ఫైనాన్షియల్‌గా ఎంతో సపోర్ట్ చేస్తారు. ఫిలిం చాంబర్ ఎలెక్షన్స్‌లోనూ నేను అధ్యక్షుడిగా ఉండాలని నా కోసం ఎంతో సాయం చేశారు. నాకు మిగిలిన ఈ టైంలో, ఆ పదవి నుంచి వెళ్లే లోపు రిజల్ట్‌ను చూపించే ప్రయత్నం చేస్తాను. లక్ష్ నటించిన ధీర ట్రైలర్ బాగుంది. ఈ సినిమా ఫిబ్రవరి 2న రాబోతోంది. లక్ష్ కష్టానికి, టీం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి. ప్రేక్షకులు ఈ సినిమాను విజయవంతం చేయాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘నేను ఇన్నేళ్లలో ఏ హీరోని కూడా డేట్స్ అడగలేదు. ఎంతో మంది దర్శకులని నేను పరిచయం చేశాను. ధీర సినిమాతో డైరెక్టర్ విక్రాంత్‌ను పరిచయం చేస్తున్నాను. దర్శకుడు పడ్డ కష్టాన్ని నేను చూశాను. ఆయన పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. తండ్రిగా నేను లక్ష్‌ను చూసి గర్విస్తుంటాను. ఇంతకు మించిన ఆనందం నాకు ఇక రాదు. ఫిబ్రవరి 2న ధీర చిత్రం రాబోతోంది. మార్చిలో నేను వంద కోట్లతో తీసిన రికార్డ్ బ్రేక్ అనే గ్రాఫిక్స్ చిత్రం రాబోతోంది. నేనే ఆ సినిమాను ఐదేళ్ల నుంచి తీస్తున్నా. అది ప్యాన్ వరల్డ్ సినిమా. సునిల్ కుమార్ రెడ్డి గారి కాంబోలో హిందీలోనూ ఓ సినిమాను చేస్తున్నాను. కే.ఎస్.నాగేశ్వరరావు తీసిన నా కనురెప్పవు నువ్వేరా కూడా రెడీగా ఉంది. మా ప్రొడక్షన్స్‌లో ఇప్పుడు పదహారు చిత్రాలు రెడీగా ఉన్నాయి. దిల్ రాజు గారిని ఛాంబర్ అధ్యక్షుడిగా చేయడంలో నా వంతు సాయం చేశాను. ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీని ఒక త్రాటిపైకి తీసుకు రావాలని అనుకుంటూనే ఉన్నాను. కానీ దిల్ రాజు గారు మాత్రం ఏకత్రాటి మీదకు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీకి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఫిల్మ్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా సాయం చేస్తామని అన్నారు. మున్ముందు చిత్ర పరిశ్రమ మరింత ఎత్తుకు వెళ్తుంది. ఇంకా మంచి మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

లక్ష్ చదలవాడ మాట్లాడుతూ.. ‘సినిమా కథ గురించి ఇప్పుడే చెప్పలేం. నా కారెక్టరైజేషన్ గురించి మాట్లాడతాను. సినిమాలోని పాత్ర, రియల్ లైఫ్‌లోని నా కారెక్టర్‌కు ఏ మాత్రం సంబంధం ఉండదు. పక్కనోడి గురించి పట్టించుకోకుండా నచ్చింది చేస్తుంటాడు. అలాంటి వాడికి ఓ మిషన్ ఇస్తే.. ఆ ప్రయాణంలో ఏర్పడిన సమస్యలు ధీరలో చూపించబోతున్నాం. నా లుక్ బాగుంది. నన్ను బాగా చూపించారు. నెపోటిజం, బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకి చాలా కష్టం. మా మీద అంచనాలుంటాయి. బయటకు వెళ్తే అవకాశాలు రావు. మీ నాన్న గారు ఉన్నారు కదా? అని అంటారు. నేను కూడా ఆఫీస్‌ల చుట్టూ తిరిగాను. మాక్కూడా అవకాశాలు రావడం కష్టమే. నాకు సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్. హీరోయిన్లు ఇద్దరూ చక్కగా నటించారు. హీరోగా, నిర్మాతగా నా వంతు ప్రయాణం చేస్తున్నాను. ఫిబ్రవరి 2న మా సినిమా రాబోతోంది. మేం ఎంత చేసినా ఆడియెన్స్‌కు నచ్చకపోతే వృథా. మీకు సినిమా నచ్చితే.. ఇంకా కష్టపడి సినిమాలు చేస్తాం. మేం నిజాయితీగా ఈ సినిమాను తీశాం. మా నాన్న గారు లేకపోతే నేను లేను. ఆయన వన్ మెన్ ఆర్మీ. ఎన్నో సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్ చూశారు. కానీ ఎప్పుడూ బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటారు. ఆయనతో మాట్లాడాలంటే ఇప్పటికీ నాకు భయమే. థాంక్స్ డాడీ.. మీ వల్లే మేం ఉన్నాం. ఎస్‌టీటీ ఫిల్మ్స్ లో ఎప్పుడూ కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. అనిల్ హ్యాపీ ఎండింగ్, ధీరజ్ అంబాజీపేట, సోహెల్ బూట్ కట్ బాలరాజు ఇలా అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటేనే మేం అంతా బాగుంటామ’ని అన్నారు.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘శ్రీనివాస్ గారి బ్యానర్‌లో వచ్చిన పోలీస్ సినిమాకు నేను అసిస్టెంట్‌గా పని చేశాను. లక్ష్ నాకు థియేటర్ ఫ్రెండ్. ఏ సినిమా వచ్చినా ఫస్ట్ డే ఫస్ట్ షోకు వస్తాడు. మిడ్ నైట్ షోలు కూడా చూస్తాం. లక్ష్‌కు సినిమాలంటే ప్రాణం. నీ కటౌట్‌ను సరిగ్గా వాడుకున్నారని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. సాయి కార్తీక్ ఆర్ఆర్ బాగుంది. లక్ష్ ప్యాషన్, కష్టపడే తత్త్వానికి తగ్గ ప్రతిఫలం రావాలి’ అని అన్నారు.

వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీలోకి రావడానికి నటసార్వభౌమ ఎన్టీఆర్ గారు స్పూర్తి.. నేను ఈ స్టేజ్ మీదకు రావడినికి చదలవాడ శ్రీనివాసరావు గారి మానవత్వం కారణం. చదలవాడ శ్రీనివాసరావు గురించి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఆయనకు చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ఆ సెంటిమెంట్లే ఈ సినిమాను హిట్ చేయాలి. నేను కూడా ఓ రెండు సెంటిమెంట్లు ఈ సినిమా గురించి చెబుతాను. ఒకే ఒక్కడు సినిమాలో మగధీర.. మగధీర అనే పాట ఉంటుంది. మగధీర సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కేజీయఫ్ సినిమాలో ధీర.. ధీర.. అనే పాట ఉంది. ఇప్పుడు ధీర సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను.

తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘డ్రైవర్ రాముడు ఫిబ్రవరి 2న విడుదలైంది.. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. శంకరాభరణం కూడా ఫిబ్రవరి 2నే విడుదలైంది. ఫస్ట్ సినిమా హిట్టైతే దర్శకుడి కెరీర్ బాగుంటుంది. విక్రాంత్ శ్రీనివాస్‌కు పెద్ద సక్సెస్ రావాలి. లక్ష్ త్వరలోనే పెద్ద స్టార్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను. కటౌట్, కంటెంట్ ఉన్న హీరో లక్ష్. ఆయనకు కథలపై మంచి జడ్జ్‌మెంట్‌ ఉంది. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘చదలవాడు శ్రీనివాసరావు గారు ఇండస్ట్రీ ఎప్పుడూ బాగుండాలని, అంతా ఒక్కత్రాటిపై నడవాలని కోరుకుంటారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ఆయన సపోర్ట్ చేసిన వాళ్లే గెలిచారు. చిన్న చిత్రాల కోసం అందరూ కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ధీర డైరెక్టర్ చాలా ఏళ్ల నుంచి రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. డైరెక్టర్ విక్రాంత్ తొలి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. లక్ష్ చాలా ప్యాషన్ ఉన్న హీరో. ఈ చిత్రంతో మంచి పేరు వస్తుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అన్నారు.

ప్రొడ్యూసర్స్ కౌనిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘కరోనా టైంలో చదలవాడ శ్రీనివాసరావు గారు కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేశారు. అడిగినోళ్లకి, అడగనోళ్లకి కూడా సాయం చేస్తుంటారు. అలాంటి గొప్ప వ్యక్తికి పుట్టిన బిడ్డ లక్ష్. అతనికి సినిమాలంటే ప్యాషన్. ఎంతో కష్టపడుతుంటారు. ఆ కష్టంతోనే సక్సెస్ వస్తుందని నమ్ముతుంటారు. బిచ్చగాడు సినిమా తెలుగులోకి రిలీజ్ కావడానికి లక్ష్ కారణం. ఈ సినిమాలో ఫైట్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. ధీర చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలి’ అని అన్నారు.

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే వారిపై ఎలాంటి అంచనాలుండవు. కానీ లక్ష్ లాంటి వారికి బ్యాక్ గ్రౌండ్ ఉండటం వల్ల అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఆయన పడే కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత విజయ రామరాజు మాట్లాడుతూ.. ‘చదలవాడ శ్రీనివాసరావు ఎంతో గొప్ప వ్యక్తి. ఎవరికి కష్టం వచ్చిందో తెలుసుకుని వెళ్లి సాయం చేస్తుంటారు. ఆయన మంచితనం వల్ల సక్సెస్ ఆయన వెంటనే ఉంటుంది. లక్ష్ ఎంతో కష్టపడుతున్నాడు. కటౌట్, యాక్టింగ్, డబ్బు ఇలా అన్నీ లక్ష్‌కు ఉన్నాయి. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు.

సిల్లీ మాంక్స్ అనిల్ మాట్లాడుతూ.. ‘లక్ష్‌తో నాకు గ్యాంగ్‌స్టర్ గంగరాజు నుంచి పరిచయం ఏర్పడింది. లక్ష్ కేవలం హీరో కాదు.. నిర్మాతగా, సీఈవోగానూ బాధ్యతలు చూసుకుంటారు. వలయం నుంచి ధీర వరకు లక్ష్‌లో చాలా మార్పులు వచ్చాయి. మున్ముందు ఆయన ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి’ అని అన్నారు.

డైరెక్టర్ విక్రాంత్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు రాసుకున్న కథ, కన్న కలలను నిర్మాత నెరవేరుస్తుంటారు. ఇంత పెద్ద బ్యానర్‌ నుంచి దర్శకుడిగా పరిచయం అవుతానని అనుకోలేదు. ఘోస్ట్‌గా రాసిన సినిమాలు హిట్టయ్యాయి. కానీ పేరు రాలేదు. ఆ తరువాత ధీర కథను రాసుకున్నాను. రాముడికి, కృష్ణుడికి కొన్ని లక్షణాలుంటాయి. రావణాసురుడికి కొన్ని లక్షణాలుంటాయి. ధీర సినిమాలోని హీరో పాత్ర కూడా గ్రే షేడ్స్‌లోనే ఉంటుంది. ఇది చాలా యూనిక్ పాయింట్. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ కథను రాసుకున్నాను. ఫస్ట్ సినిమానే తేడా కొడితే దర్శకుడి జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. లక్ష్ నాకు ప్రతీ విషయంలో సపోర్ట్‌గా నిలిచారు. కెమెరా వర్క్, మ్యూజిక్ అంతా బాగా వచ్చింది. ఈ చిత్రం 80 శాతం నైట్ ఎఫెక్ట్‌లో ఉంటుంది. ఫిబ్రవరి 2న రాబోతోన్న అన్ని చిత్రాలు హిట్ అవ్వాలి. సినిమా పరిశ్రమ బాగుంటేనే మేం అంతా బాగుంటామ’ని అన్నారు.