అక్షయ్ హీరోగా, ‘ప్రేమలు’ మూవీ ఫెమ్ మమిత బైజు కీలక పాత్రలో, ఐశ్వర్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డియర్ కృష్ణ’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కి, మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను రంజింపజేసిందో సమీక్షిద్దాం.
కథ:
హీరో అక్షయ్ కాలేజ్ చదివే కుర్రాడు. తండ్రి బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. తండ్రి కొడుకుల్లా కాకుండా స్నేహితుల్లా వీరి బంధం ఉంటుంది. వీరిని అపురూపంగా చూసుకునే అక్షయ్ తల్లి. కాలేజీ, ఫ్రెండ్స్, టీచర్స్ ఇలా సాగుతున్న అక్షయ జీవితంలోకి హీరోయిన్ రాధిక వస్తుంది. వీరి ప్రేమకు హీరో తండ్రి సలహాలు ఇస్తూ సపోర్ట్ చేస్తుంటాడు. కానీ రాధిక వాళ్ళ అమ్మానాన్నలకు ఇది నచ్చదు. ఈ క్రమంలో హీరోకు ఒక ఆరోగ్య సమస్య బయటపడుతుంది. మొదట్లో ఇది చిన్న సమస్య అనుకున్నప్పటికీ కొన్ని టెస్టులు రిపోర్టుల తర్వాత ఇది ప్రాణాంతకమైన సమస్యగా ఉందని డాక్టర్స్ చెప్తారు. ఆ సమస్య ఏంటి? ఆ సమస్య నుంచి అక్షయ్ ఎలా బయటపడ్డారు.? డాక్టర్ చేతులెత్తేసిన అక్షయ్ సమస్య ఎలా పరిష్కరించబడింది.? ఇక అక్షయ్ ప్రేమను దక్కించుకున్నాడా? లేదా.? రాధిక వాళ్ళ పేరెంట్స్ సమస్య ఏంటి? అనేది తెలియాలంటే డియర్ కృష్ణ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
హీరో అక్షయ్ జీవితంలో 2015లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వైద్య చరిత్రలోనే ఇది ఒక అరుదైన కేసుగా.. ఇలాంటి సమస్యకు వైద్యులు మాత్రమే కాకుండా దైవ శక్తి కూడా తోడైంది. అన్న పాయింట్ ను నమ్మి.. అదే పాయింట్ తో ఈ సినిమాను ప్రేక్షకులకు అందించారు.
ఈ చిత్రంలో మొదటి భాగం అక్షయ్ లైఫ్ స్టైల్, వాళ్ళ అమ్మానాన్న ల మధ్య ఉన్న రిలేషన్ షిప్, ఫ్రెండ్షిప్, కాలేజీ లైఫ్ స్టైల్, అక్షయ్ తోటి విద్యార్థులకు చేసే సహాయాలను పరిచయం చేశారు. అలాగే హీరోయిన్ ఐశ్వర్య, అక్షయ్ ల మధ్య లవ్ ట్రాక్ కూడా యూత్ కి కనెక్ట్ అయ్యేలా చూపించిన విధానం ఆకట్టుకుంది. అక్షయ్ స్నేహితురాలిగా నటించిన చిత్ర పాత్రలో మమిత బైజు ఆకట్టుకుంది. అక్షయ్ కున్న ఆరోగ్య సమస్య బయటపడిన తర్వాత అసలైన సంఘర్షణ మొదలవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ యూత్ ను కట్టి పడేసేలా రాసుకున్నారు. ఈ జంటకు ఉండే లవ్ సమస్యను కూడా చాలా ప్రాక్టికల్ గా చూపించారు.
అక్షయ్ ఆరోగ్య సమస్యతో మంచి ఇంటర్వెల్ బ్యాంక్ ఉంటుంది. ఇక సెకండాఫ్ అంతా మెడికల్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ పాయింట్స్ ను టచ్ చేస్తూ.. దైవభక్తి ఎలా పనిచేస్తుందో చూపించారు. సెకండాఫ్ చాలా వరకు ఆసుపత్రిలో జరిగే సంఘర్షణ ఉంటుంది కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా లోతైన భావోద్వేగాలను పండించిన విధానం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు హీరో అక్షయ్ కి ఏమవుతుందో అన్న ఒక టెన్షన్ ను డైరెక్టర్ చూపించిన విధానం బాగుంది. ప్రీ క్లైమాక్స్ లో డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసిన తరుణంలో ప్రేక్షకుడు గుండె దడ పెరుగుతుంది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే ఎన్నో సన్నివేశాలు, ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టే సెన్స్ ను సెకండాఫ్ హ్యాండిల్ చేస్తున్న విధానంలో డైరెక్టర్ పనితనం తెరపై పండింది. సెకండాఫ్ సినిమాను భావోద్వేకంగా నిలబెట్టిందని చెప్పవచ్చు.
నటీనటులు:
హీరోగా నటించిన అక్షయ్ సిల్వర్ స్క్రీన్ కు కొత్త అయిన ఎంతో అనుభవం ఉన్న నటుడిలా అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఈ సంఘటన ఆయన నిజ జీవితంలోనే జరిగింది కాబట్టి ఆ సంఘటనల తాలూకు సంఘర్షణను కనబరచడంలో అక్షయ్ విజయం సాధించారు. ఎక్స్ ప్రెషన్స్ కూడా చాలా సహజంగా పండించారు. ఇదే స్థాయిలో చెప్పుకోదగ్గ పాత్ర తండ్రిగా నటించినా అవినాష్ పాత్ర. ఫస్టాఫ్ అంతా కేవలం కొడుకుతో స్నేహంగా ఉండే భావోద్వేగాలను పండించి సెకండ్ హాఫ్ లో లోతైన భావోద్వేగాల సంఘర్షణను చూపిస్తూ ప్రేక్షకుడిని సైతం కంటతడి పెట్టేలా చేశారు. తల్లి పాత్రలో నటించిన శాంతి కృష్ణ అద్భుతమైన ఎమోషనల్ సీన్స్ అందించారు. మమత బైజు మంచి నటనను కనబరిచారు. హీరోయిన్ గా ఐశ్వర్య అభినయం అందం నటన సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. మిగతా నటీనటులంతా తమకున్న పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు.
సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్టర్ దినేష్ బాబు యదార్థ సంఘటనను సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా ప్రేక్షకుల హృదయాలను తాకే సీన్స్ ను డైరెక్ట్ చేసిన విధానం మెప్పించింది. సెకండ్ హాఫ్ లో వచ్చే భావోద్వేగాలను అద్భుతంగా పట్టుకున్నారు. చాలా సీన్లు హృదయానికి హత్తుకునేలా డిజైన్ చేసిన విధానం మెప్పించింది. కామెడీ లవ్ ఎమోషనల్ అండ్ మిరాకిల్ సీన్స్ ను అద్భుతంగా తెరకెక్కించారు. దర్శకుడు దినేష్ బాబుకు కచ్చితంగా మంచి భవిష్యత్ ఉంటుందని ఆయన టేకింగ్ చూస్తే అర్థమవుతుంది. హరి ప్రసాద్ అందించిన సంగీతం నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. పాటలు బాగున్నాయి. అలాగే ఎమోషనల్ సీన్స్ లో వచ్చే బిజిఎం కట్టి పడేసింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మాత పిఎన్ బాలు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను అందించిన విధానం ప్రేక్షకులను మెప్పించింది.
ప్లస్ పాయింట్స్:
కథ, కథనం, డైరెక్షన్, నటీనటులు
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ లో కొంతైనా కామెడీ ఉంటే బాగుండేది.
సారాంశం :
యదార్ధ సంఘటనల మధ్య ఎటువంటి అభ్యన్తరమైన సీన్స్ & డైలాగ్స్ లేకుండా దైవత్వాన్ని చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం. ప్రేక్షకులు అంత కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం డియర్ కృష్ణ.